చేర్యాల, ఫిబ్రవరి 19 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్దపట్నం కార్యక్రమాన్ని శనివారం రాత్రి ఆలయవర్గాలు అత్యంత వైభవంగా నిర్వహించాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో కొమురవెల్లి మల్లికార్జునస్వామిక్షేత్రం మార్మోగింది. పెద్ద ఎత్తున్న తరలివచ్చిన భక్తులు శివరాత్రి పర్వదినం సందర్భంగా జాగరణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మలతో కొలువైన శ్రీ మల్లికార్జునస్వామి వారికి తలనీలాలు సమర్పించి కోనేటిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి కావడంతో భక్తులు ఉదయం నుంచి “శివశివ శంభోశంకర, హరహర మహదేవ” అంటూ నామస్మరణలు చేస్తూ స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గంటల తరబడి క్యూలో ఉండి రాత్రి పొద్దుపోయే వరకు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. కొంతమంది మహిళలు గుట్టపైన ఉన్న ఎల్లమ్మతల్లికి బోనాలు సమర్పించారు.
భక్తిశ్రద్ధలతో పెద్దపట్నం
ఆలయవర్గాల ఆధ్వర్యంలో ఒగ్గు పూజారుల నేతృత్వంలో ‘పెద్ద పట్నం’ నిర్వహించారు. మహా శివరాత్రి సందర్భంగా లింగోద్భవ కాలం రాత్రి 12 గంటలకు మల్లికార్జునస్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయ అర్చకులు రాజగోపురం, రాతిగీరలు తదితర ప్రాంతాల్లో ఊరేగించి తిరిగి ఆలయంలోకి తీసుకువెళ్లారు. అనంతరం ఒగ్గు పూజారులు రాత్రి 12 గంటలకు మొదటగా గంగస్నానం, పన్నెండున్నరకు బియ్యాన్ని సుంకు పట్టడం, ఒంటి గంటకు మైలపోలు అనంతరం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఒగ్గుపూజారులు పంచరంగులు కుంకుమ (ఎరుపు), పసుపు, తెలుపు (బియ్యం పిండి), ఆకుపచ్చ (తంగేడు పిండి), గులాలు తదితర వాటి చూర్ణాలు కలిపి ముగ్గులుగా వేసి పట్నం తయారు చేశారు.
భారీగా భక్తుల రాక
స్వామి వారి పెద్దపట్నం కార్యక్రమాన్ని చూసేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన 50 వేల మందికి పైగా భక్తులు కొమురవెల్లి క్షేత్రానికి తరలివచ్చారు. భక్తులు పెద్దపట్నం తిలకించేందుకు వీలుగా ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఆలయ ఈవో బాలాజీ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అడిషనల్ డీసీపీ (అడ్మిన్) మహేందర్, ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు భాస్కర్‌రెడ్డి, చంద్రమోహన్, నారాయణ, నరేందర్‌రెడ్డి, పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
ఐదో వారానికి భారీగా తరలివచ్చిన భక్తులు
కొమురవల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం ఐదో వారానికి కరీంనగర్, మెదక్, వరంగల్ తదితర ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 20 వేల మందికి పైగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి వారి క్షేత్రానికి వచ్చిన భక్తులు ‘మల్లన్న స్వామి…మమ్మేలు స్వామి’ అంటూ చేసిన నినాదాలతో ఆలయం మార్మోగింది. మల్లన్న దర్శనంతో భక్తులు పులకించిపోయారు. శనివారం రాత్రి నుంచే మొదలైన భక్తుల రాక ఆదివారం సాయంత్రం వరకు కొనసాగింది. భక్తులు కోనేటిలో పవిత్ర స్నానాలు ఆచరించి క్యూ ద్వారా స్వామివారి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అర్చనలు, అభిషేకాలు చేశారు. భక్తుల వసతి కోసం ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఈవో బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ఆలయ సిబ్బంది విధులు నిర్వర్తించారు.