సిద్దిపేట, జూలై 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పేదల ఆహార భద్రత కోసం ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నది. కొంతమంది వ్యాపారులు రేషన్ బియంతో దందా చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పేదల బియ్యంతో కోట్ల రూపాయల దందా సాగుతున్నది. లబ్ధిదారులు రేషన్ బియ్యం తీసుకొని పోయిన తర్వాత వారి ఇండ్ల వద్ద ప్రత్యేక వాహనాల ద్వారా సేకరిస్తున్నారు. మరికొన్ని చోట్ల రేషన్ డీలర్లు వేలి ముద్రలు పెట్టించుకొని లబ్ధిదారులకు తక్కువ ధరతో డబ్బులు చెల్లించి రెట్టింపు ధరలకు రాత్రి సమయంలో ఆ బియ్యాన్ని రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో రేషన్ బియ్యం దందా మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతోంది. పౌరసరఫరాలశాఖ, రెవెన్యూశాఖలోని కొంతమంది అధికారులు రైస్ మిల్లర్లతో చేయి కలిపి ఈ దందాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పేరుకు టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేశామని చెప్పి ఒకటి రెండు చోట్ల దాడులు చేయడం…ఆ తర్వాత విస్మరించడం పరిపాటిగా మారింది. దాడులకు వెళ్లే ముందు కొంతమంది సిబ్బంది ముందస్తుగానే సమాచారం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఒక వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందజేస్తున్నది. సిద్దిపేట జిల్లాలో ప్రతి నెలా 2,91,400 కుటుంబాలకు 684 రేషన్‌షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఆహార భద్రత కార్డు ద్వారా కుటుంబంలోని సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుం డా ఒక్కొక్కరికి ఆరు కిలోలు, అంత్యోదయ కార్డుదారులకు 35కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నారు. మెద క్ జిల్లాలో 520 రేషన్‌షాపుల ద్వారా 2,13,855 కార్డుదారులకు, సంగారెడ్డి జిల్లాలో 846 రేషన్ షాపుల ద్వారా 3,81,375 ఆహార భద్రత కార్డుల ద్వారా బియ్యాన్ని అందిస్తున్నది.
లబ్ధిదారుల్లో చాలామంది ఆర్థిక స్థోమత ఉన్నవారే ఉన్నారు. వారితోపాటు కొం దరు పేదలు కూడా రేషన్‌షాపులో ఇచ్చే దొడ్డు బియ్యం తినకుండా విక్రయిస్తున్నారు. దీన్ని గ్రామాలు, పట్టణాల్లోని రేషన్ డీలర్లు తమ దుకాణాల్లో బియ్యం తీసుకునేందుకు వచ్చిన వినియోగదారుల కార్డునంబర్ ఈ-పాస్ మిషన్‌లో నమోదు చేస్తున్నారు. కార్డులోని లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా ఏమేరకు బియ్యం ఇవ్వాలో చూసి కిలోకు గ్రామాల్లో రూ. 10 నుంచి రూ. 12, పట్టణాల్లో రూ. 15 నుంచి రూ. 18 వరకు ఇస్తున్నారు. ఇలా లబ్ధిదారులు బియ్యం కాకుండా డబ్బులు తీసుకుపోతున్నారు. ప్రతినెలా రేషన్ షాపుల్లో మిగిలిన బియ్యాన్ని బస్తాల్లో నింపి రాత్రివేళల్లో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు.
గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి మరికొంత మంది వ్యాపారులు ఆటోల్లో సేకరించి సిద్దిపేట, హుస్నాబాద్, చేర్యాల, దుబ్బాక, రామాయంపేట, మెదక్, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో ఉన్న రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, ఆందోల్ తదితర ప్రాంతాల నుంచి లారీల్లో పక్క రాష్ర్టాలకు చీకటి వేళల్లో తరలిస్తున్నారు. చెక్‌పోస్టుల్లో అధికారులకు మామూళ్లు ఇచ్చి దర్జాగా ఇత ర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదంతా సంబంధిత అధికారులకు తెలిసి జరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. జహీరాబాద్ చెక్‌పోస్టు కేంద్రంగా రోజూ రేషన్ బియ్యం లారీలు తరలుతున్నా అక్కడ ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
పేరుకే చెక్‌పోస్టు కానీ అక్కడ మామూళ్లతోనే పనులు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని పలు రైస్ మిల్లులకు తరలించిన రేషన్ బియ్యాన్ని సీఎంఆర్ కింద ప్రభుత్వానికి అందిస్తూ భారీ మొత్తంలో రైస్ మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. లబ్ధిదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని వచ్చే నెల మళ్లీ రేషన్ షాపులకు పంపిణీ చేస్తున్నారు. ఇలా ప్రతి నెలా జరుగుతూనే ఉన్నది. అధికారులకు ఈ విషయం తెలిసి కూడా పట్టించుకోవడం లేదు.
ఇటీవల సిద్దిపేట జిల్లా దుద్దెడ స్టేజీ వద్ద రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ బోల్తాపడగా అం దులోని బియ్యం బస్తాలు పీడీఎస్ రైస్ అని తెలింది. ఆ బియ్యా న్ని సిరిసిల్ల జిల్లా జిల్లెల్ల నుంచి వికారాబాద్‌కు అక్రమం గా తరలిస్తున్నారు. తకువ ధరకు కొనుగోలు చేసి ఎకువ ధరకు అమ్మడానికి అక్రమ రవాణా చేస్తు న్న విషయం బయటపడింది. ఆ లారీలో 140 క్విం టాళ్ల బియ్యాన్ని సివిల్ సైప్లె అధికారులు, స్థానిక పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేశారు. జహీరాబాద్ చెక్ పోస్టుతోపాటు ఇటీవల చిన్నకోడూరు, సిద్దిపేట రూరల్ మండలంలో పెద్దమొత్తంలో బియ్యాన్ని పట్టుకున్నారు.