జహీరాబాద్, డిసెంబర్ 21: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం, అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండలాల్లో ప్రజల కష్టాలు ఎట్టకేలకు తొలిగిపోయాయి. నెల రోజులుగా వేతనాల కోసం కార్మికులు చేపట్టిన ఆందోళనతో అధికార యంత్రాంగం దిగివచ్చింది. కార్మికులకు వేతనాలు చెల్లించడంతో దాదాపు 75 గ్రామాలకు మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి సరఫరాను పునరుద్ధరించేందుకు కార్మికులు చర్యలు తీసుకున్నారు. పది నెలలకు సంబంధించి వేతనాల కోసం మిషన్ భగీరథ కార్మికులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. వేతనాల కోసం పలుమార్లు అధికారులు, కాంట్రాక్టర్కు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు దిగారు.
నవంబర్లో మిషన్ భగీరథ తాత్కాలిక కార్మికులకు ఒకనెల జీతాన్ని అందజేసి, మిగిలిన ఆరు నెలలకు సంబంధించి 20వ తేదీలోగా చెల్లిస్తామని సంబంధింత అధికారుల సమక్షంలో కాంట్రాక్టర్ ఒప్పంద పత్రాన్ని రాసి తాత్కాలిక కార్మికులకు అందజేశారు. ఇచ్చిన ఒప్పందం ప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో మళ్లీ ఆందోళనకు దిగారు. వేతనాల చెల్లింపు విషయంలో రెండు, మూడుసార్లు జిల్లా, మండల అధికారులు కార్మికులతో జరిపిన చర్చలు విఫలమైయ్యాయి. వేతనాల కోసం కార్మికుల చేస్తున్న ఆందోళనతో ఆయా మండలాలకు తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నానా తంటాలు పడ్డారు.
తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కార్మికల వేతనాల కోసం చేస్తున్న ఆందోళనపై పలుమార్లు పత్రికల్లో వార్తలు రావడంతో జిల్లా అధికారులు స్పందించారు. రెండు రోజుల క్రితం మునిపల్లి మండలం బుధేరాలో అధికారులు కార్మికులతో జరిపిన చర్చలు సఫలమైయ్యాయి. శనివారం మిషన్ భగీరథ జిల్లా ఎస్ఈ రఘువీర్, హెచ్ఆర్ పాష, సైట్ ఇంజినీర్ రంజిత్ న్యాల్కల్లో కార్మికులకు కొన్ని నెలలకు సంబంధించిన వేతనాలు చెల్లించారు. మిగిలిన వేతనాలు చెల్లించడంతోపాటు ఏప్రిల్ నుంచి వేతనాలు పెంచడంతోపాటు హెల్త్త్కార్డు, ఐడీకార్డు మం జూరు చేసి, ఇంక్రిమెంట్, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించేలా చర్య లు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి వేతనాలు ఇప్పించేలా కథనాలు రాసిన నమస్తే తెలంగాణ యాజమాన్యానికి కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు. కష్టాలు తొలిగిపోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వృథాగా మిషన్ భగీరథ నీళ్లు.. పట్టించుకోని అధికారులు
కంగ్టి, డిసెంబర్ 21: మిషన్ భగీరథ నీళ్లు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి గ్రామాల్లో ఇంటింటికీ తాగునీళ్లు అందించే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకానికి తూట్లు పొడుస్తున్నది. సంగారెడ్డి జిల్లా కంగ్టి గ్రామంలోని భీంరా రోడ్డులో మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు సరఫరా అయ్యే పైప్లైన్ లీకేజీ కావడంతో నీళ్లు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్లపై నీళ్లు నిలబడటంతో దోమల బెడద అధికమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి తెలిపినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. లీకేజీ వల్ల కాలనీలో నీళ్లు సక్రమంగా సరఫరా కావడం లేదని, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలంటున్నారు.