పటాన్చెరు, ఆగస్టు 25: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటి గ్రామం నుంచి ఘనపూర్, వెలిమెల వైపు వెళ్లే రహదారి గుం తలమయంగా మారింది. ఔటర్ సర్వీసు రోడ్డు నుంచి ఘనపూర్, వెలిమెల, కొల్లూరు గ్రామాలకు వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు అధ్వానంగా మారింది.
ముఖ్యంగా పాటి గ్రామ కమాన్ నుంచి గ్రామ పంచాయతీ వరకు రోడ్డు గతుకులమయంగా మారింది. వందలాది వాహనాలు ప్రయాణించే ఈ రోడ్డుపై గుంతలు, కంకర తేలాయి. దీనికి తోడు వర్షం పడటంతో ఆ నీరు గుంతల్లో నిలుస్తున్నది. ద్విచక్రవాహనదారులు, కార్లు, ఆటో ల్లో ప్రయాణించేవారు ఈ గుంతల్లో పడి గాయాలపాలవుతున్నారు. రోడ్డుకు ఆర్అండ్బీశాఖ అధికారులు మరమ్మతులు చేయా ల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు.
ప్రమాదా లు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చినా, పంచాయతీ తరఫున కనీసం గుంతలను కూడా పూడ్చడం లేదు. పాటి గ్రామస్తులే అధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ పంచాయతీ భవనం సమీపంలోనే ఈ దుస్థితి నెలకొనడం విచారకరం. రోడ్డుకు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు ఎన్నిసార్లు అధికారులను కోరి నా సమస్య పరిష్కారం కావడం లేదు. సంబంధితశాఖ అధికారులు గుంతలను పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.