మెదక్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : మెదక్ ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఎమ్మెల్యే రోహిత్ వ్యాఖ్యలు ఉండాలి.. కానీ అతని వ్యాఖ్యలు దిగజార్చే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఈ నెల 17న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అతనిపై కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆదివారం ఆమె మెదక్ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
సిద్ధాంతపరంగా విమర్శలు చేసుకోవాలి కానీ ఇది సమంజసం కాదన్నారు. చట్టాలు చేసే ఎమ్మెల్యేనే సమాజానికి ఏమి మెసేజ్ పంపుతున్నారని ధ్వజమెత్తారు. పద్ధతి మార్చుకొని మెదక్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు కానీ వాటిని నెరవేర్చి అభివృద్ధి పథంలో నడిపించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీలు అమలు పర్చాలన్నారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండి స్తూ రామయంపేటలో బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదు చేస్తే ఇది మా పరిధిలోకి రాదంటూ ఆఫిర్యాదును తిరస్కరించారన్నారు.
అలాంటప్పుడు బీఆర్ఎస్ కార్యకర్త రవీందర్‌రెడ్డిని పీఎస్‌కు తీసుకువచ్చి కొట్టి అతని ఫోన్ సీజ్ చేశారు ఇది ఎకడి న్యాయం అని ప్రశ్నించారు. పోలీసుల పనితీరు ప్రభుత్వానికి ఒక న్యాయం, ప్రతిపక్షాలకు ఒక న్యాయంలా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో చట్టం అందరికీ సమానమేనని, పోలీసుల తీరు ప్రజాస్వామ్యంగా లేదన్నారు. పోలీసు చర్యల ద్వారా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను భయపడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఒకసారి కేసీఆర్ పిలిపునిస్తే లక్షలాదిగా కార్యకర్తలు తరలివస్తారని గుర్తు చేశారు. మూడున్నర సంవత్సరాల పదవీకాలం ఉందని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి వాళ్ల సమస్యలు పరిషరించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్య లను చాలామంది ట్రోల్ చేశారని వాళ్లపైన ఎందుకు కేసు పెట్టలేదన్నారు. తాగునీరు, విద్యుత్, రైతు భరోసా కోసం రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. మెదక్ ఎమ్మెల్యే అందుబాటులో లేక సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియక ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. సమావేశంలో జడ్పీ మాజీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు కృష్ణాగౌడ్, కిష్టయ్య, గౌస్, ప్రభురెడ్డి, మాజీ సర్పంచ్‌లు లింగం, సాయిలు, యామిరెడ్డి, మైహిపాల్రెడ్డి, మోహన్‌నాయక్, ఎలక్షన్‌రెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు.