పటాన్చెరు టౌన్, ఏప్రిల్ 28: గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో వ్యాపార నిర్ణయం తీసుకోవడం కోసం కృత్రిమ మేధస్సు, యంత్ర అభ్యాసంపై మే 25 నుంచి 29 వరకు ఆన్లైన్లో ఆచరణాత్మక కార్యశాల నిర్వహిస్తున్నట్లు గీతం ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆధునిక వ్యాపార నిర్ణయం తీసుకోవడంలో కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషీన్ లెర్నింగ్(ఎంఎల్)లో పెరుగుతున్న ప్రాధాన్యాన్ని సదస్సులకు పరిచయం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
బిజినెస్ అనలిటిక్స్, డేటాసైన్స్, ఏఐ-ఎంఎల్ అప్లికేషన్లలో విస్తృత అనుభవం ఉన్న విద్యావేత్త, పరిశోధకుడు డాక్టర్ ఎం.కామాక్షయ్య ప్రధాన శిక్షకుడిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ సెమినార్ పూర్తయ్యే సరికి ఇందులో పాల్గొనేవారు విషయ పరిజ్ఞానంపై అవగాహనతో పాటు ఏఐ ఎంఎల్ పద్ధతులను ఆచరణాత్మకంగా తెలుసుకుంటారని తెలిపారు. ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వారు తమ పేర్ల నమోదు, రుసుం, ఇతరత్రా వివరాల కోసం jpaul@gitam.eduకు ఈ మెయిల్ చేయాలని లేదా డాక్టర్ జోసెఫ్ పాల్‌ను సంప్రదించాలని సూచించారు.