అమీన్పూర్, డిసెంబర్ 24: కాపురానికి భార్యను పంపడంలేదన్న కక్షతో భార్య, ఆమె అక్కతో పాటు ఆమె కొడుకును హతమార్చేందకు పథకం పన్ని, వారు పనికి వెళ్లే సమయంలో మాటు వేసి రోడ్డుపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఒక మహిళ మృతి చెందింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. ఇన్చార్జి సీఐ సురేందర్‌రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడురు మండలం జాయ్యరం గ్రామానికి చెందిన మల్లారాపు శ్రీనివాస్‌గౌడ్, సునీత తన కొడుకు కూతురుతో కలిసి కుత్భుల్లాపూర్ పరిధిలోని చింతల్‌కు బతుకుదెరువు కోసం వచ్చారు. శ్రీనివాస్‌గౌడ్ నిత్యం మద్యం తాగుతూ భార్యతో గొడవ పడుతున్నాడు. దీంతో విసుగు చెందిన సునీత అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీవాణినగర్‌లో నివసిస్తున్న తన సొంత అక్క సుజాత(46) ఇంటికి నెల క్రితం వచ్చింది. ఇక్కడే ఉంటూ స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో అక్కతో పాటు తాత్కాలికంగా ఉద్యోగం చేసుకుంటున్నది. శనివారం ఉదయం 5 గంటలకు ఉద్యోగంలో భాగంగా మొదటి షిప్ట్‌కు నడుచుకుంటూ వెళ్తుతున్నది.
ఈ క్రమంలో వాణీనగర్ వృద్ధాశ్రమం వద్ద శ్రీనివాస్‌గౌడ్ కాపు కాసి కత్తితో దాడి చేశాడు. అదే సమయంలో అక్క సుజాత తన కొడుకు సాయికిరణ్‌తో కలిసి బైక్‌పై పరిశ్రమకు వెళ్తున్నారు. తన చెల్లెలిపై దాడి చేస్తున్నది చూసి, వారించగా కక్ష పెంచుకున్న శ్రీనివాస్‌గౌడ్ వారిపైనా కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో సుజాత అక్కడిక్కడే మృతి చెందింది. అతడి భార్య సునీత, సాయికిరణ్ తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న వారిని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. బాచ్పల్లిలోని ఒక ప్రైవేటు దవాఖానకు క్షతగాత్రులను తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి సునీత, సాయికిరణ్‌కు చికిత్స అందిస్తున్నారు. పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి, అమీన్పూర్ ఇన్చార్జి సీఐ సురేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సుజాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ఏరియా దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల అదుపులో నిందితుడు..
ముగ్గురిపై కత్తితో దాడి చేసి ఒకరిని హతమార్చిన శ్రీనివాస్‌గౌడ్‌ను కొన్ని గంటల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు బృందాలుగా ఏర్పడి చింతల్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ సురేందర్‌రెడ్డి తెలిపారు.