మద్దూరు(ధూళిమిట్ట), ఫిబ్రవరి 21: సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని ఏఆర్ గార్డెన్లో శుక్రవారం జరుగుతున్న బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మద్దూరు మండలంలోని గాగిళ్లాపూర్ గ్రామానికి చెందిన మైనర్ అమ్మాయితో రేబర్తి గ్రామానికి చెందిన అబ్బాయితో బాల్య వివాహాన్ని జరిపిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది.
దీంతో ఐసీడీఎస్ సీడీపీవో రమాదేవి, తహసీల్దార్ రహీం, ఎస్సై షేక్మహబూబ్, ఆర్ఐ రమే శ్, సూపర్వైజర్ పుష్పలత వివాహ మండపం వద్దకు వెళ్లి వివాహాన్ని నిలిపివేశారు. అమ్మాయికి 18 ఏండ్లు నిండలేదని అధికారులు ధ్రువీకరించి, అమ్మాయి, అబ్బాయిల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మేజర్లయిన తర్వాతే వివాహం జరిపిస్తామని ఇరువర్గాల నుంచి అధికారులు లిఖిత పూర్వకమైన హామీ పత్రాన్ని తీసుకున్నారు. బాల్య వివాహాలను జరిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.