మెదక్ రూరల్, జూన్06: తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వైకుంఠధామాలు ఇప్పుడు అలంకార ప్రాయంగా దర్శనమిస్తున్నాయి. అధికారులు వైకుంఠ ధామాలను పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.
మెదక్ మండలంలోని 29 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వైకుంఠ ధామాలను నిర్మించతలపెట్టారు. వీటిలో చాలావరకు పూర్తికాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తూతూమంత్రంగా వాటిని పూర్తి చేశారు. ఒక్కో పంచాయతీలో 10 నుంచి 13 లక్షల వ్యయంతో వైకుంఠ ధామాలను నిర్మించారు. ఎంతో మహోన్నత ఆశయంతో నిర్మించిన వైకుంఠధామాలు మూడు నాలుగు సంవత్సరాలు కావస్తున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలో లేదు. నిర్మించిన సగం వైకుంఠ ధామాల్లో కనీస మౌలిక వసతులు లేక కునారిల్లుతున్నాయి.
కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా నిర్మించి నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతో అప్పుడే గోడలు పలిగి, బాత్రూంల్లో నీళ్లు రాక, రూమ్‌లకు తలుపులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ మండలంలోని కొన్ని వైకుంఠధామాలకు దారి సరిగ్గా లేదని, వర్షాకాలంలో మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. వైకుంఠధామాలను అధికారులు పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిలో మౌలిక వసతులు కల్పించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.