దుబ్బాక, ఫిబ్రవరి 7: మాఘ అమావాస్య అంటేనే..‘ కూడవెల్లి జాతర’…! కూడవెల్లిలో మాఘ స్నానాలు ఆచరించి రామలింగేశ్వరుడిని దర్శించుకుంటే.. సకల సిరిసంపదలతో పాటు కైలాస ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. దక్షణ కాశీగా పేరొందిన కూడవెల్లి రామలింగేశ్వరక్షేత్రం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట-భూంపల్లి మండలంలోని రామేశ్వరంపల్లిలో ఉంది. ఈ జాతరకు సిద్దిపేట జిల్లా వాసులే కాకుండా పక్క జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. రామలింగేశ్వరుడిని దర్శించుకుని, ఆలయం వద్ద జాతరను తిలకించేందుకు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆసక్తి కనబరుస్తారు.
మాఘ అమావాస్య రోజు ‘త్రివేణి సంగమం’గా పేరొందిన కూడవెల్లివాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఒడ్డుపై వెలిసిన రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఏటా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నెల 9 నుంచి 13 వరకు (ఐదు రోజులు) ఆలయం వద్ద పెద్ద ఎత్తున జాతర కొనసాగనుంది. ఆలయం వద్ద భక్తుల సౌకర్యం కోసం దేవాలయ పాలకవర్గం, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.