గజ్వేల్, ఫిబ్రవరి 4: రీజినల్ రింగ్‌రోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగం భూసేకరణలో రైతులకు చెల్లించాల్సిన పరిహారంపై అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ట్రిపుల్ఆర్ భూసేకరణలో రైతులతో ఆర్డీవోలు నిర్వహించే సమావేశాల్లో ఎకరాకు ఎంత పరిహారం చెల్లిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ డివిజన్ పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు మాత్రం మార్కెట్ ధరకు మూడింతల పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని, లేకుం టే భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఉత్తర భాగంలోని ట్రిపుల్ఆర్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం త్వరగా పనులు పూర్తి చేయాలని చూస్తున్నది.
కానీ, క్షేత్రస్థాయిలో పురోగతి లేదు. భూసేకరణ విషయంలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. రైతులకు, అధికారులకు మధ్య పరిహారం విషయంలో సఖ్యత కుదరడం లేదు. ట్రిపుల్ఆర్ భూ బాధితులతో ఇటీవల గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ సమావేశం నిర్వహించి భూసేకరణను కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నించారు. రైతులు డిమాండ్‌కు అధికారులు చెబుతున్న లెక్కలకు పొంతన కుదరడం లేదు. అధికారులు చెబుతున్న పరిహారం లెక్కలను తాము అంగీకరించబోమని రైతులు తేల్చి చెబుతున్నారు. గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో వ్యవసాయ భూములకు మంచి డిమాండ్ ఉంది. భూములు బాగా ధరలు పలుకుతున్నాయి. దీంతో రైతులు మార్కెట్ ధరకు మూడింతలు ధర చెల్లించడంతోపాటు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగైతేనే తాము సాగుభూములు ఇస్తామని అధికారులకు చెబుతున్నారు. అధికారుల, రైతుల మధ్య పొంతన కుదరకపోవడంతో పరిహారంపై ఏకాభిప్రాయం కుదిరేనా అనే సం దేహాలు వ్యక్తమవుతున్నాయి. భూసేకరణ కోసం రెవెన్యూ డివిజన్ల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించి పరిహారం ఫైనల్ చేసే పనిలో అధికారులు ఉన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో…
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో 4,500 ఎకరాల వరకు ట్రిపుల్ఆర్ నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టనుండగా, ఇందులో 180 ఎకరాల వరకు అటవీ భూములు ఉన్నాయి. గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అటవీ ప్రాం తంలో 70ఎకరాల మీదుగా ట్రిపుల్ఆర్ వెళ్లనున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అత్యధికంగా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 980 ఎకరాలు సేకరించనున్నారు. అందులో గజ్వేల్ పరిధిలో 32 కిలోమీటర్ల మేర రోడ్డు పనుల నిమిత్తం 17 గ్రామాల్లో, తూప్రాన్ పరిధిలో 14కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం 8గ్రామాల్లో, నర్సాపూర్‌లో 28కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం కోసం 14గ్రామాల్లో భూసేకరణ చేపట్టనున్నారు. అందోల్-జోగిపేట రెవె న్యూ డివిజన్ పరిధిలో 8.5 కిలోమీటర్లకు రోడ్డు నిర్మాణానికి ఐదు గ్రామాల్లో, సంగారెడ్డి పరిధిలో 11గ్రామాల పరిధిలో 27.5 కిలోమీటర్ల భూసేకరణ చేపట్టనున్నారు.
గజ్వేల్ పరిధిలో 980 ఎకరాలు
గజ్వేల్ పరిధిలోని ఆయా గ్రామాల మీదుగా ట్రిపుల్ఆర్ రోడ్డు నిర్మాణం కోసం రైతులతో అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం 158 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆయా గ్రామాల్లో రైతుల నుంచి 980 ఎకరాలను సేకరించనున్నారు. డివిజన్ పరిధిలోని జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి, ఇటిక్యాల, అలిరాజ్‌పేట, మర్కూక్ మండలం అంగడికిష్టాపూర్, చేబర్తి, పాతూర్, నర్సన్నపేట, ఎర్రవల్లి, గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్, మక్తమాసాన్‌పల్లి, బంగ్లావెంకటాపూర్, వర్గల్ మండలం మైలారం, జబ్బాపూర్, నెంటూర్, సామలపల్లి, రాయపోల్ మండలం బేగంపేట, ఎల్కల్ గ్రామాల్లోని రైతుల నుంచి 980 ఎకరాలను సేకరించనున్నారు.
గరిష్టంగా రూ.2 నుంచి రూ.3 కోట్లపైనే…
ట్రిపుల్ఆర్ రోడ్డు వెళ్లే మార్గంలో వ్యవసాయ భూములకు ఎకరాకు గరిష్టంగా ధర రూ.2నుండి రూ.3కోట్లపైనే ఉండగా , కనిష్టంగా రూ.50లక్షల వరకు ధర ఉంది. మార్కెట్ ధర అధికంగా ఉండడంతో రైతులు తమకు భూమికి భూమి లేదా మార్కెట్ ధరకు మూడింతలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ లెక్కనా రైతుల కోరుతున్న పరిహారంపై అధికారులు ఏవిధంగా నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో విలువైన భూములు ట్రిపుల్ఆర్ రోడ్డు నిర్మాణంలో పొతుండడంతో రైతులు దిగులు పడుతున్నారు.