
మెదక్, జనవరి11 : ప్రగతి పనులను మార్చిలోపు పూర్తి చేయాలని, అందుకు అధికారులంతా సమన్యయంతో కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పథకాల పనితీరు, ప్రగతిపై హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీలు కూచకుల్ల దామోదర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ శరత్, జిల్లాల అదనపు కలెక్టర్లు, డీఆర్డీవో, డీపీవో, ఎంపీడీవో, ఇంజినీరింగ్ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా మూడో వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పారిశుధ్యంపై రాజీలేకుండా, పల్లెప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రెండో విడుత వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని, బూస్టర్ డోస్‌ను అధికారులు ఎప్పటికప్పు డు పర్యవేక్షిస్తూ.. ఆరోగ్య తెలంగాణ సాధనలో ముందుండాలని ఆకాంక్షించారు. పల్లెప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాల స్థలాలను గుర్తించాలని అధికారులకు సూచించారు.
మెదక్ జిల్లాలో పల్లె ప్రకృతి వనాలకు సంబంధించి 105 ప్రాంతాలను గుర్తించి.. 43 స్థలాలను సంబంధించి ఆన్లైన్లో అప్లోడ్ చేశామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. మిగతా సైట్లు గుర్తించి అప్డేట్ చేయడానికి తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ సీఈవో శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్‌కుమార్, డీఎల్పీవోలు, మండల పరిషత్ అధికారులు, పంచాయతీ రాజ్ అధికారులు పాల్గొన్నారు.