దుబ్బాక, ఆగస్టు 15: అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా (యూసీఎఫ్) ‘ఇండియా సెంటర్’ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అకాడమిక్ కార్యక్రమం ‘సైంటిస్ట్ ఇన్ రెసిడెన్స్’కు సిద్దిపేట జిల్లా దుబ్బాక బల్దియా పరిధిలోని లచ్చపేటకు చెందిన డాక్టర్ తిరుమల్ ఎంపికయ్యారు. ఈనెల 9 నుంచి 16 వరకు అమెరికాలో కొనసాగుతున్న వైద్య విద్యా సంబంధిత కార్యక్రమంలో డాక్టర్ తిరుమల్ పాల్గొంటున్నారు. న్యూరో సర్జరీ విభాగంలో ఈ అరుదైన గుర్తింపు పొందిన తొలి భారతీయుడిగా ఘనత సాధించారు.
యూసీఎఫ్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ కార్యక్రమం ముగింపు రోజు ఆయన ప్రత్యేక ఉపన్యాసం ఇవ్వనున్నారు. వర్సిటీ ప్రొఫెసర్లు , వైద్య విద్యార్థులు, ప్రవాస భారతీయులతో నిర్వహించే సమావేశంలో ఆధునిక వైద్య విద్య, న్యూరో సర్జరీలో అత్యాధునిక విధానాలు, వైద్యరంగంలో కృత్రిమ మేధ(ఏఐ) వాడకం, భారత్ అమెరికా మధ్య పరస్పర సహకారం తదితర కీలక అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. ఆగస్టు 15న ఓర్లాండోలోని ఇండి యా సెంటర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించే భారత స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. న్యూరో సర్జరీ విభాగంలో డాక్టర్ తిరుమల్ దశాబ్దానికి పైగా అపార అనుభవం ఉంది. బయోపోర్టల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ, ఎండోస్కోపిక్ స్కల్ బేస్ సర్జరీ, వాస్యులర్ న్యూరో సర్జరీ, న్యూరో అంకాలజీ తదితర సంక్షిష్ట శస్త్రచికిత్సల్లో ఆయన నిష్ణాతులు.
రోగి మేల్కొని ఉండగానే చేసే అరుదైన బ్రెయిన్ సర్జరీల్లోనూ (అవేక్ న్యూరో సర్జికల్ ప్రొసీజర్స్) ఆయనకు విశేష అనుభవం ఉంది. వైద్యవృత్తిలోనే కాకుండా సాహస క్రీడలపై ఆసక్తి చూపుతారు. 31 కి.మీ లోతు వరకు సముద్రంలో డ్రైవింగ్ చేయగల సర్టిఫైడ్ స్కూబా డ్రైవర్ కావ డం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై డాక్టర్ తిరుమల్ హర్షం వ్యక్తం చేశారు. తన ఉన్నతికి తల్లిదండ్రులు ఎర్రగుంట సుజాతాప్రసాద్తో పాటు సతీమణి డాక్టర్ శ్రీలత సహకారం మర్చిపోలేనిదన్నారు. దుబ్బాక మున్సిపాలిటీలోని లచ్చపేటకు చెందిన ఎర్రగుంట తిరుమల్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి వరకు చదివాడు. న్యూరో సర్జరీలో గోల్డ్ మెడల్ అందుకున్నాడు. నిమ్స్‌లో న్యూరో సర్జన్, అదనపు ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు.