మెదక్, జనవరి 1 : 2021కి ముగింపు పలుకుతూ 2022కి కోటి ఆశలతో మెదక్ జిల్లా ప్రజలు స్వాగతం పలికారు. పట్టణాలు, పల్లెల్లో కొత్త సంవత్సర వేడుకలు కొనసాగాయి. ప్రజలు పటాకులు కాల్చుతూ.. నూతన సంవత్సర కేక్‌లు కట్ చేస్తూ ఉత్సాహంగా సందడి చేశారు. పట్టణాలు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగుల్లో మెరిసిపోయాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఎమ్మె ల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ హేమలతాశేఖర్‌గౌడ్, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్, జిల్లా ఎస్పీ రోహిణిప్రియదర్శిని శుభాకాంక్షలు తెలిపారు.
కిటకిటలాడిన ఆలయాలు
నూతన సంవత్సరం సందర్భంగా జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు కిటకిటలాడాయి. మెదక్ చర్చిలో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
అర్ధరాత్రి నుంచే పటాకుల మోతలు… కేక్ కటింగ్‌లు
నూతన సంవత్సరం వేడుకలు మెదక్ జిల్లాలో అంబరాన్నంటాయి. శుక్రవారం రాత్రి నుంచే యువకులు, చిన్నారులు పెద్ద ఎత్తున పటాకులు కాల్చుతూ వేడుకలు నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు నూతన సంవత్సరం కేక్‌లు కట్ చేస్తూ సంబురాలు జరుపుకొన్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే మహిళలు రంగురంగుల ముగ్గులు వేశారు.
ప్రత్యేక పూజల్లో మున్సిపల్ చైర్మన్
జిల్లా కేంద్రంలోని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేంకటేశ్వర దేవాలయం, కొదండ రామాలయంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ కుటుంబ సమేతంగా పూజలు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా వేంకటేశ్వర దేవాలయ కమిటీ అధ్యక్షుడు మధుసూదన్ నిరుపేద మహిళలకు చీరెలు పంపిణీ చేశారు.
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
మండల పరిధిలోని మంబోజిపల్లి కోయ్యగుట్ట శ్రీమల్లికార్జున స్వామి, హనుమన్ ఆలయం, కాలబైరవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉద యం నుంచే అభిషేకాలు, పూజలు చేశారు. ఆలయపూజారి మల్లన్నస్వామి, ఆలయకమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కొల్చారం మండలంలో..
పలు గ్రామాల్లో యువకులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కేక్ కట్‌చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మద్యం దుకాణాలు, మటన్, చికెన్ సెంట ర్లు, హోటళ్లు జనంతో కిటకిటలాడాయి. ఇదిలా ఉండగా అర్ధరాత్రి దాటిన తర్వాత వాట్సాఫ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాంలాంటి సోషల్మీడియాల ద్వారా స్నేహితులు, బంధువులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. పలు దేవాలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు.
ఉమ్మడి వెల్దుర్తి మండలంలో..
వెల్దుర్తి, జనవరి 1. ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను ఉమ్మడి వెల్దుర్తి మండలంలో ఘనంగా చేసుకున్నారు. ఉద యం నుంచి ఆలయాల వద్ద ప్రజలు బారులు తీరారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇండ్ల ముందు తీరొక్క ముగ్గులు వేసి రంగులతో తీర్చిదిద్దారు.
నిజాంపేటలో..
మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని చర్చిల్లో పాస్టర్లు కేక్ కట్ చేశారు.
చాముండేశ్వరి మాతను దర్శించుకొన్న భక్తులు
మండలంలోని చిట్కుల్ గ్రామ శివారులోని మంజీరానది సమీపంలో వెలసిన చాముండేశ్వరి అమ్మవారిని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన పూజరి ప్రభాకర్‌శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
రామాయంపేటలో..
పట్టణంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. పట్టణంలోని రాజేంద్రనగర్, పద్మశాలీవాడ, మహాంకాళి కాంప్లెక్స్, దుర్గమ్మబస్తీ, అక్కలబస్తీలకు చెందిన మహిళలు తమ వాకిళ్ల ముందు ముగ్గులు వేశారు. పట్టణంలోని ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి స్వగృహంలో కుటుంబసభ్యులతో కలిసి కేక్ కట్‌చేసి స్వీట్లు పంపిణీ చేశారు.