గజ్వేల్ అర్బన్, అక్టోబర్ 22 : ఎన్సీసీ క్యాంపులు యువతలో నాయకత్వ లక్షణాలను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఎంతో దోహదపడుతాయని ఎన్సీసీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ వీఎంరెడ్డి అన్నారు. కొద్దిరోజులుగా గజ్వేల్ బాలుర ఎడ్యుకేషన్‌హబ్‌లో జరుగుతున్న జాతీయస్థాయి ఎన్సీసీ క్యాంపు ముగింపు సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎడ్యుకేషన్ హబ్‌ను పూర్తిగా పరిశీలించి ఏర్పాట్ల విషయంలో అధికారులను అభినందించారు. సమావేశంలో కెడెట్లనుద్దేశించి వీఎంరెడ్డి మాట్లాడారు. జాతీయ స్థాయి ఎన్సీసీ క్యాంపు గజ్వేల్‌లో నిర్వహించడం, అందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసి క్యాంపు విజయవంతానికి కృషి చేసి రాష్ట్ర ఎన్సీసీకి మంచి పేరు తెచ్చారన్నారు. ఇలాంటి జాతీయ స్థాయి ఎన్సీసీ క్యాంపులో పాల్గొనడంతో కెడెట్లకు వివిధ రాష్ర్టాల సంస్కృతీ సంప్రదాయాలు తెలుస్తాయన్నారు. క్యాంపులతో కెడెట్లలో ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం అలవడుతాయన్నారు. ఈ ప్రత్యేక జాతీయ స్థాయి క్యాంపులో కెడెట్లు సందర్శించిన ప్రదేశాలు, పరిశ్రమల ప్రత్యేకత గురించి మరోసారి వీఎం రెడ్డి కెడెట్లకు వివరించారు. అనంతరం క్యాంపునకు సహకరించిన మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి క్యాంపు నిర్వహణకు సహకరించినందుకు వారికి వీఎం రెడ్డి జ్ఞాపికలు అందజేశారు. క్యాంపులో 24గంటలపాటు సేవలందించిన గజ్వేల్ దవాఖాన డాక్టర్ విజయేందర్‌రెడ్డి, సిబ్బంది వాసుదేవ్, ఐశ్వర్య, గౌతమి సేవలను కొనియాడారు. క్యాంపులో సాంస్కృతిక పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. క్యాంపు కమాండెంట్ కల్నల్ సునీల్ అబ్రహం జాతీయ శిబిరం నిర్వహణకు సహకరించిన జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్ జీవన్‌పాటిల్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, సీపీ శ్వేత పాల్గొన్నారు.