నేటి నుంచి కేతకీ ఆలయంలో నవాహ్నిక బ్రహోత్సవాలు
పది రోజుల పాటు కార్యక్రమాలు
మహా శివరాత్రికి ముమ్మర ఏర్పాట్లు
లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు
ఝరాసంగం, ఫిబ్రవరి 25 : శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నవాహ్నిక బ్రహ్మోత్సవాలకు సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయం ముస్తాబైంది. ఈ నెల 26 నుంచి మార్చి 6వ తేదీ వరకు శివరాత్రి జాతర జరుగనున్నది. పది రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోనే ఈ ఆలయం అతి పెద్దది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లే 65వ నెంబరు జాతీయ రహదారిపై జహీరాబాద్ పట్టణం ఉన్నది. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఝరాసంగం శ్రీకేతకీ సంగమేశ్వరస్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడి అమృత గుండంలో స్నానాలు చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాదిగా భక్తజనం తరలిరానున్నది. కాగా, కొవిడ్ నిబంధనల మేరకు జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా అమృతగుండంలో పుణ్యస్నానాలు చేసేందుకు నిరాకరించి, షవర్ల ద్వారా గుండంలోని నీటితో స్నానాలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
నిత్యపూజా కార్యక్రమాలు
కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 26వ తేదీ నుంచి 6 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. 26 శనివారం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, సాయంత్రం పల్లకీసేవ, భజనలు, 27న ఆదివారం స్వామివారిక రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, 28న సోమవారం స్వామి వారికి రుద్రాభిషకం, అమ్మవారికి కుంకుమార్చన, సాయంత్రం శేషవాహన సేవ, గ్రామ పుర వీధుల మీదుగా ఊరేగింపు, రాత్రి పల్లకీసేవ, భజనలు, 1వ తేదీన మంగళవారం మహాశివరాత్రి, అగ్నిప్రతిష్ఠ, గణపతిహోమం, స్వామివారికి అభిషేకం, రాత్రి మహాన్యాస పూర్వీక ఏకదశి రుద్రాభిషేకం, పల్లకీసేవ తదితర కార్యక్రమాలుంటాయి. 2న బుధవారం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, రుద్రస్వాహకార, నవగ్రహశాంతి హోమం, నందివాహన సేవ, రాత్రి 12గంటలకు అగ్నిగుండం, పూజ, అగ్నిప్రతిష్ఠ, 3న గురువారం ఉదయం 4గంటలకు అగ్నిగుండం, స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, రుద్రాస్వాహకార హోమం, సాయంత్రం పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం, రాత్రి స్వామివారికి రథోత్సవం, పల్లకీసేవ ఉంటాయి. 4న శుక్రవారం స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, మధ్యాహ్నం 12.35 పూర్ణాహుతి, పల్లకీసేవ, 6న ఆదివారం స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, పల్లకీసేవ, 7న సోమవారం స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, లక్షబిల్వార్చన, అన్నదానం పల్లకీసేవతో జాతర ముగుస్తుంది.
మహాశివరాత్రికి భారీ ఏర్పాట్లు..
మహా శివరాత్రి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తుల సహకారంతో ఉత్సవాలను విజయవంతం చేస్తాం. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి, స్వామి వారి ఆశీస్సులు పొందాలి.
– శ్రీనివాసమూర్తి, కేతకీ ఆలయ ఈవో, ఝరాసంగం