పటాన్చెరు, ఫిబ్రవరి 28: సైన్స్‌లో సరైన పరిశోధనలు జరిగి, సైన్స్‌ను సరిగ్గా వినియోగించకుంటే మానవాళి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపగలదని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, శాస్త్రవేత్త, భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, గీతం ఛేంజ్ మేకర్స్ సిరీస్‌లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భారత్ బయోటెక్‌ను స్థాపించడం నుంచి కోవాక్జిన్, టైప్‌బార్ టీసీవీ, రోటావాక్ వంటి సంచలనాత్మక వ్యాక్సిన్ల అభివృద్ధి వరకు తన ప్రయాణాన్ని వివరించారు. కేవలం ఇద్దరు ఉద్యోగులతో ప్రారంభమైన భారత్ బయోటెక్ ప్రయాణం, ప్రస్తుతం నాలుగువేల మంది బృందానికి ఎదిగిందని తెలిపారు. క్లినికల్ పరిశోధన ప్రాముఖ్యత, సమస్య పరిష్కారం గురించి వివరించారు. కాలానుగుణంగా నూతన ఆవిష్కరణలు అవసరం అని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలు, శాస్త్ర, సాంకేతిర రంగాల్లో సత్తాచాటితే దేశాన్ని మరింత వృద్ధి పథంలో నడపవచ్చని సూచించారు.
ఆవిష్కరణల్లో మనం మరింత పురోగమించాలని, శాస్త్రీయ జ్ఞాన సంపదను సరిగ్గా వినియోగించుకోవాలని కోరారు. గీతం వర్సిటీ ఎంఐటీ వంటి ప్రఖ్యాత సంస్థలకు సరిసమానమని డాక్టర్ ఎల్లా పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలు తీర్చేలా విద్యాసంస్థల్లో ప్రాజెక్టులు చేపట్టాలంటూ గీతం పరిశోధకులకు ఆయన పిలుపునిచ్చారు. గీతం హైదరాబాద్‌లో నెలకొల్పిన మల్టీడిసిప్లీనరీ యూనిట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ట్రాన్సేషనల్ ఇనిషియేటివ్స్ (ఎంయూఆర్టీఐ)ని డాక్టర్ ఎల్లా ప్రారంభించారు.
ఈ అత్యాధునిక పరిశోధనా కేంద్రం ఇంటర్ డిసిప్లీనరీ పరిశోధనలను ప్రోత్సహించడం, ముఖ్యమైన ప్రాంతీయ, జాతీయ, ప్రపంచ సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు గీతం ప్రతినిధులు తెలిపారు. అనంతరం గీతం సంస్థల అధ్యక్షుడు శ్రీభరత్, గీతం చాన్స్‌లర్ డాక్టర్ వీరందర్ సింగ్ చౌహాన్ డాక్టర్ కృష్ణ ఎల్లాను సత్కరించారు. ఐఐసీటీ పూర్వ డైరెక్టర్, గీతం విశిష్ట ఆచార్యులు డాక్టర్ శ్రీహరి చంద్రశేఖర్ అతిథిని పరిచయం చేసి కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. కార్యక్రమంలో గీతం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.