పటాన్చెరు, డిసెంబర్ 15 : పటాన్చెరులో వాల్యూజోన్ హైపర్ మార్ట్‌ను ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో అతిపెద్ద ఔట్లెట్ మాల్ వాల్యూజోన్ను సంస్థ ప్రముఖులు వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాదరావులతో కలిసి ఆయన ప్రారంభించగా, బాలకృష్ణను చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థ యాజమాన్యంతో తనకు చాలా స్నేహం ఉందన్నారు. ఈ వాల్యూజోన్ హైపర్ మార్ట్ రిటైల్ వాణిజ్య వ్యవస్థలోనే ఒక వినూత్న విప్లవమన్నారు. హైదరాబాద్‌లోనే అతి పెద్ద మార్ట్ వాల్యూజోన్ అని కొనియాడారు. తనను వాల్యూజోన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం సంతోషాన్ని కలిగిస్తున్నదన్నారు. సరికొత్త వ్యాపార ఆలోచనతో యాజమాన్యం ముందుకు వచ్చిందని, తప్పకుండా ప్రజలు ఆదరిస్తాని తనకు నమ్మకం ఉందన్నారు. ఫ్యాషన్, ఫుడ్, ఫన్ ఒకేచోట ఉండడంతో ప్రజలు ఆహ్లాదరకరమైన షాపింగ్ అనుభూతిని పొందుతారన్నారు. కొత్త రకమైన ఆలోచనలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. పూర్వకాలంలో తన తండ్రి ఎన్టీఆర్ కూడా కొత్త ఆలోచనలతో ముందుకుపోవడంతోనే చరిత్ర సృష్టించారన్నారు. అన్ని రకాలైన వస్తువులు ఒకేచోట లభ్యం కావడంతో డబ్బు, సమయం ఆదా అవుతుందన్నారు. వాల్యూజోన్ హైపర్ మార్ట్ సక్సెస్ కావాలని ఆయన ఆకాంక్షించారు.
హైదరాబాద్‌లోనే మొట్టమొదటి అతిపెద్ద ఔట్లెట్ మాల్ వాల్యూజోన్ అని ఆ సంస్థ ప్రతినిధులు వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాదరావు తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో వాల్యూజోన్ రాక కొత్త రకమైన వ్యాపారానికి నాంది పలికినట్లుగా వారు పేర్కొన్నారు. నాణ్యతకు పెద్దపీట వేస్తామని తెలిపారు. విలువలను పాటిస్తూ వ్యాపారం నిర్వహిస్తామన్నారు. ప్రజలు చెల్లించే ప్రతి రూపాయికీ తగిన విలువను అందజేస్తామన్నారు. గ్లోబల్ బ్రాండ్స్, ఇండియన్ ఫ్యాషన్ బ్రాండ్స్ మొదలుకుని గ్రాసరీస్, ఫుట్‌వేర్, లగేజ్, ఫర్నిషింగ్స్, స్టేషనరీ, మొబైల్ యాక్ససరీస్లు ఒకేచోట లభిస్తున్నాయన్నారు. 2లక్షల వైవిద్యభరితమైన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఏడాది పొడవునా అనేక ఆఫర్లతో వినియోగదారులకు లభించేలా చేస్తున్నామన్నారు. పటాన్చెరులో ఈ వాల్యూజోన్ హైపర్ మార్ట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జాతీయ రహదారి, రింగ్‌రోడ్డుకు కూతవేటు దూరంలో తమ ఔట్లెట్ ఏర్పాటు చేశామన్నారు. విశాలమైన పార్కింగ్, పిల్లలకు ఆటలాడేందుకు ఫన్ జోన్, భోజన ప్రియులకు ఫుడ్ జోన్లు కూడా ఉన్నాయన్నారు. నందమూరి బాలకృష్ణ తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం ఆనందంగా ఉందని తెలిపారు.