సదాశివపేట, నవంబర్ 24: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని సిద్దాపూర్ రోడ్డులో ఉన్న దుకాణ సముదాయాన్ని అధికారులు నిరుపయోగంగా వదిలేశారు. నెలకు లక్షల ఆదాయం వచ్చే కూరగాయలు, నాన్ వెజ్ మార్కెట్ దుకాణ సముదాయాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏండ్లు గడుస్తున్నా వ్యాపారులకు కేటాయించకుండా ఖాళీగా ఉంచారు. దీంతో మున్సిపల్‌కు వచ్చే ఆదాయానికి గండి పడుతున్నది.
పట్టణంలోని సిద్దాపూర్ రోడ్డులో 2015-16 సంవత్సరంలో రూ.30లక్షల 14వ ఆర్థిక సంఘం నిధులతో 19 దుకాణాలను నిర్మించారు. సెప్టెంబర్ 26, 2018లో వెజ్, నాన్‌వెజ్ దుకాణ సముదాయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కొన్ని రోజులకు నిర్మాణ పనులు చేపట్టి దుకాణ సముదాయాన్ని నిర్మించారు. దుకాణ సముదాయన్ని నిర్మించి ఏండ్లు గడుస్తున్నా ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు. దుకాణ సముదాయం ఖాళీగా ఉన్నందున మున్సిపాలిటీకి వచ్చే ఆదాయానికి గండి పడుతున్నది. అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దుకాణ సముదాయంపై దృష్టి సారించాలని కోరుతున్నారు.