టేక్మాల్: నింగిలోని చుక్కలన్ని నేలపై వాలినట్లు, రంగుల హరివిల్లు భువిపై చేరినట్లు, ముగ్గులను చక్కగా వేసి రంగు రంగులతో అందంగా తీర్చిదిద్దిన ముగ్గులతో ముందుగానే అచ్చన్నపల్లిలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని అచ్చన్నపల్లి గ్రామంలో అదమా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. గ్రామంలోని మహిళలు, యువతులు ఉత్సాహాంగా ముగ్గుల పోటీల్లో పాల్గొని ముచ్చటగా ముగ్గులు వేశారు.
పోటీల్లో గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాయాగౌడ్, కంపెనీ ప్రతినిధులు మార్కెటింగ్ డెవలప్మెంట్ మేనేజర్ రమేష్ రెడ్డి, సేల్స్ ఆఫీసర్ విష్ణువర్ధన్, కమర్షియల్ సేల్స్ ఆఫీసర్ ఎల్లంపల్లి మోహన్, ఫీల్డ్ అసిస్టెంట్ తలారి బేతయ్య తదితరులు ఉన్నారు.