సిద్దిపేట,ఆగస్టు 30: సిద్దిపేటకు చెందిన శానంగారి రత్నమ్మ, ఆమె కుమారుడు శానంగారి శ్రీనివాస్‌చారి ఏటా మట్టి గణేశ్ విగ్రహాలను తయారు చేయడమే కాకుండా అనేక మందికి శిక్షణ ఇచ్చి పర్యావరణ పరిరక్షణకు తమవంతుగా కృషిచేస్తున్నారు. ‘మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం’ అనే ఆకాంక్షతో సిద్దిపేట పట్టణానికి చెందిన ఈ తల్లీకొడుకు మట్టి వినాయకుల విగ్రహాలు తయారీచేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులు, ఆసక్తి ఉన్న వారికి నల్ల బంకమట్టితో వినాయక విగ్రహాల తయారీపై శిక్షణ సైతం ఇస్తున్నారు.
80ఏండ్ల వయస్సులో ఎంతో ఇష్టంగా ఓపికతో గణనాథుని విగ్రహాలను తయారుచేస్తున్నారు రత్నమ్మ. ఆమె భర్త బ్రహ్మయ్యచారి ప్రోత్సాహంలో మట్టి విగ్రహాలను తయారీ చేయడం ప్రారంభించిన రత్నమ్మ, దాదాపు 70 ఏండ్ల నుంచి మట్టి విగ్రహాలను తయారీ చేస్తున్నారు. రత్నమ్మ కుమారుడు శ్రీనివాసచారి కొన్నేండ్లుగా విద్యార్థులకు శిక్షణనిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషిచేద్దామనే స్ఫూర్తిని చాటుతున్నాడు. చెరువు నుంచి తెచ్చిన మట్టితో విగ్రహాలను తయారుచేస్తున్నారు.ఇందులో ఎలాంటి రసాయనాలు లేకుండా విగ్రహాలను తయారుచేసి వాటర్ పెయింట్‌తో రంగులు అద్దుతారు. పెద్ద గణపతి విగ్రహాలను హ్యాండ్మేడ్గా చేస్తున్నారు. చిన్న వినాయక ప్రతిమలను చెక్క సాంచెల సహాయంతో తయారు చేస్తున్నారు. వినాయక చవితికి రెండు మూడు నెలల ముందు నుంచే విగ్రహాలను తయారు చేయడం మొదలు పెడుతారు. ఆర్డర్లను బట్టి విగ్రహాలను తయారు చేస్తారు.
చేర్యాల, ఆగస్టు 30 : ఏటా మట్టి వినాయకుడి విగ్రహాన్ని తయారుచేసి ఇంట్లో పూజించుకుంటున్నారు చేర్యాల పట్టణానికి చెందిన మంగళగిరి శేషాచార్యుల కుటుంబం. శేషాచార్యులు చేర్యాలలోని వేణుగోపాల స్వామి దేవాలయ ప్రధానార్చకుడు. ఆయన పదేండ్ల క్రితం వరకు మట్టి వినాయకుడితోనే పండుగ జరుపుకొనేవారు. వృద్ధాప్యం కారణంగా ఆయన కుమారుడు రాజు 12 ఏండ్లుగా చెరువులోని మట్టిని తెచ్చి, బొజ్జగణపతిని ప్రతిష్ఠించుకుని ఆకులు, అలములు, పండ్లు, పూలు, గరకతో సహజసిద్ధ్దమైన ప్రకృతి మండపాన్ని ఏర్పరిచి 9 రోజులు పూజలు చేస్తున్నారు. రాజు స్వతాహాగా సైన్స్ విద్యార్థి కావడంతో తమ కోవెలలో అల్లనేరేడు, దానిమ్మ, మారేడు, జమ్మి, గన్నేరు, గరక, రేగు, మామిడి, మర్రి, రాలే, కొబ్బరి, అరటి, పారిజాతం, మల్లె, ఉసిరి తదితర మొక్కలను పెంచి పోషిస్తూ తమకే కాకుండా, అందరికీ సరిపడే పూజాద్రవ్యాలు ఉచితంగా అందిస్తుండడం విశేషం.