కోహీర్, సెప్టెంబర్ 11: తెలంగాణలో 80వేల ఎకరాల రైతులభూములు వక్ఫ్ బోర్డు పేరున నమోదు అయ్యాయని మహబూబ్‌నగర్ ఎంపీ, వక్ఫ్ సవరణ చట్టం జేపీసీ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. రైతు హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో బుధవా రం జహీరాబాద్‌లోని ఎన్ కన్వన్షన్ హాలులో ఏర్పా టు చేసిన వక్ఫ్ భూ బాధిత రైతులతో ఆమె ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కులమతాలకతీతంగా రైతులకు న్యాయం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం బిల్లును ప్రవేశ పెట్టిందన్నారు. వక్ఫ్ బోర్డులో భూమి రికార్డు అయిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భూములు విక్రయించడం, కొనడం చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పెండ్లి కోసం భూమిని అమ్మాలన్నా అవకాశం లేదన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు లేక రూ.2లక్షల రుణమాఫీ, రైతుబంధు రాలేదని గుర్తు చేశారు.
ఈ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మసీదులు, శ్మశాన వాటిక స్థలాలను ఎవరూ తీసుకెళ్లరని చెప్పారు. రైతులు వ్యవసాయం చేస్తున్న భూ ముల వివరాలు మాత్రమే సేకరించి కమిటీకి అందజేస్తామని వెల్లడించారు. జహీరాబాద్ డివిజన్లోని 12,892 ఎకరాల భూమికి వక్ఫ్ బోర్డు నుంచి విముక్తి కల్పించాలని రైతులు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురా లు గోదావరి అంజిరెడ్డి, రైతు సాధన సమితి కన్వీనర్ వెంకటేశ్వర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జైపాల్‌రెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, వీరారెడ్డి, రామచందర్, భాస్కర్‌రెడ్డి, మనోహర్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.