సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 12: రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, ఆరోగ్య తెలంగాణ దిశగా పయనిస్తున్నదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం సంగారెడ్డిలో 2కే రన్‌ను జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్తో కలిసి జెండా ఊపి 2 కే రన్ ప్రారంభించారు. జిల్లా పోలీసు, క్రీడలు, యువజన శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్ అందరినీ ఆకర్షించింది. అనంతరం కల్వకుంట రోడ్డులో నిర్వహించిన కార్యక్రమంలో బెలూన్లు గాలిలోకి వదిలారు. ఈ సందర్భంగా ఎంపీ పాటిల్ మాట్లాడుతూ తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత ప్రజల కష్టాలు తీరాయన్నారు. జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ఆనందంగా ఉన్నదన్నారు.
అభివృద్ధి పథంలో రాష్ట్రం: కలెక్టర్ శరత్
సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన ప్రజలకు మరింత చేరువైందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. పటిష్టమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. 2014లో ఉమ్మడి జిల్లా జేసీగా పని చేసినప్పుడు రోడ్లు అధ్వానంగా ఉండి, ప్రయాణం కష్టంగా ఉండేదన్నారు. సాగు, తాగు నీటికి ప్రజలు పడ్డ కష్టాలను గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్త రోడ్ల నిర్మాణం, రోడ్ల పునరుద్ధరణతో ప్రయాణాలు మెరుగయ్యాయన్నారు. మిషన్ భగీరథతో తాగు నీటి కష్టాలు తీరాయని, మిషన్ కాకతీయ, చెక్ డ్యామ్‌ల నిర్మాణంతో జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. సాగు విస్తీర్ణం మూడింతలు పెరిగిందన్నారు.
దీంతో పంట దిగుబడి పెరిగి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. జిల్లాలో సీఎం కప్ క్రీడలతో మంచి స్పందన వచ్చిందని, ప్రజల్లో చైతన్యం వచ్చి అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారని కలెక్టర్ వివరించారు. ఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు ఒక ఫోన్ కాల్‌తో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్నారు. వెంటనే స్పందించే ఫ్రెండ్లీ పోలీసులని గుర్తు చేశారు. కార్యక్రమంలో హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, డీఆర్వో నగేశ్, ఆర్డీవో, డీఎస్పీ, ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల ఉద్యోగులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.