మద్దూరు(ధూళిమిట్ట)/నంగునూరు, ఏప్రిల్ 2 : సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట, నంగునూరు మండలాల పరిధిలో విస్తరించిన మోయతుమ్మెదవాగు వాగు ఒకప్పుడు పరీవాహక రైతులకు వరప్రదాయినిగా ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అక్రమార్కులు మోయతుమ్మెద వాగును గుల్ల చేసి సొమ్ము చేసుకుంటుండంతో వాగు వట్టిపోతున్నది. కొన్నాళ్లుగా అక్రమార్కులు అధికారుల అండదండలతో ఇసుక అక్రమ దందా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌లను సైతం ధ్వంసం చేస్తున్నారు. వాగుల్లో తాత్కాలికంగా రోడ్లు నిర్మించి యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్న వైనంపై గురువారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక మెయిన్ ఎడిషన్‌లో ‘మోయతుమ్మెదలో ఇసుక తోడేళ్లు!’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నా యి.
ధూళిమిట్ట, జాలపల్లి, ఖాతా, ఘణపురం, అక్కెనపల్లి గ్రామాల్లో సాగుతున్న అక్రమ ఇసుక దందా నిఘావర్గాలు ఆరాతీస్తున్నాయి. ఇసుక దందాను చేస్తున్న అక్రమార్కుల వివరాలు వారికి అండగా నిలుస్తున్న అధికారుల వివరాలను నిఘావర్గాలు గోప్యంగా సేకరిస్తున్నాయి. ఇసుక వ్యాపారులు అధికారులకు చెల్లింపులు చేసిన ఫోన్‌పే, గూగుల్‌పే వివరాలను సైతం సేకరించినట్లు సమాచారం. ‘నమస్తే తెలంగాణ’ కథనానికి ధూళిమిట్ట రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్దార్ శ్యామ్ ఆదేశాల మేరకు ఆర్ఐ రవీందర్, జీపీవో కృష్ణ జాలపల్లిలోని మోయతుమ్మెద వాగును గురువారం పరిశీలించారు. సరిహద్దు ప్రాంతంలో ఖాతాకు చెందిన కొంతమంది అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నట్లు తహసీల్దార్ల రిపోర్ట్ అందించారు.
ఇసుకను బయటకు పోనివ్వమని తీర్మానం..
తమ గ్రామ పరిధిలోని మోయతుమ్మెద వాగులోని ఇసుకను తమ గ్రామ అవసరాలకే తప్ప ఇతర ప్రాంతాలకు తరలించడాన్ని నిషేధిస్తూ మార్చి 26న ధూళిమిట్ట గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగీవ్రంగా తీర్మానం చేసింది. అడ్డగోలుగా ఇసుక త్రవ్వకాలు చేపడుతుండడంతో భూగర్భజలాలు అడుగంటిపోయి సాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామ పంచాయతీ ఈ మేరకు తీర్మానం చేసింది. దీనికితోడు మైనింగ్ ఆన్లైన్ విధానం కేటాయింపును నిలిపివేయాలని పాలకవర్గం హుస్నాబాద్ ఆర్డీవోకు వినతి పత్రాన్ని అందించింది.