సిద్దిపేట, ఏప్రిల్ 7: జీవితాంతం ప్రజా సేవలో ఉంటానని, పేదవారికి సేవలందించడమే తన ముఖ్య లక్ష్యమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం సిద్దిపేటలోని లిమ్రా గార్డెన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట గంగా జమున తెహజీబ్‌కు కేంద్ర బిందువన్నారు. నాటి ఎమ్మెల్యేలు మదన్మోహన్, కేసీఆర్ కాలం నుంచే ఇకడి ప్రజలు సోదరాభావంతో కలిసి మెలిసి ఉంటారన్నారు.
సిద్దిపేట అన్ని రంగాల్లో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఆఖరి సఫర్ అనే అంతిమ యాత్ర వాహనాన్ని సిద్దిపేటలోనే అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మృత దేహాలను భద్రపర్చడానికి అన్ని మసీదుల్లో బాడీ ఫ్రీజర్లను అందుబాటులో ఉంచామన్నారు. సొంత డబ్బుతో సిద్దిపేట ముస్లింల కోసం ఎన్సాన్‌పల్లిలో మూడెకరాల భూమిని కొనిచ్చి, బోరుమోటర్ వేసి, ఫెన్సింగ్ చేసి, గేటు పెట్టి ఇచ్చానన్నారు. నేడు ఆ భూమికి కోట్ల విలువ వచ్చిందన్నారు.
సిద్దిపేటలోని అన్ని దర్గా, మసీద్, ఖబ్రస్తాన్ల నిర్మాణాలు, మరమ్మతులకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చానన్నారు. ఇమామ్, మౌజన్లకు జీతభత్యాలు అందించామన్నారు. ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తామన్నారు. నిరుపేద ముస్లిం మహిళలు ఉపాధి పొందాలన్న లక్ష్యంతో సొంతంగా కుట్టుమిషన్లు అందించానన్నారు. ఏటా పదిమంది నిరుపేదలకు ఉమ్ర యాత్రకు పంపిస్తున్నట్లు తెలిపారు. బతికున్నంత కాలం ఏటా పంపిస్తూనే ఉంటానన్నారు. ప్రతి రంజాన్‌కు తనతో పాటు ఆర్ఆర్ మసాలా సంస్థ సహకారంతో 4 వేల మంది పేద ముస్లింలకు ఉచిత రేషన్ కిట్లు అందిస్తున్నామన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే హైదరాబాద్ తర్వాత మొట్టమొదటి హజ్‌హౌస్ నిర్మాణం సిద్దిపేటలోనే చేసుకున్నామని తెలిపారు. మదీనా ఫంక్షన్ హాల్‌కు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు కావాల్సిన సామగ్రిని సమకూర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రూ.25 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎండ తీవ్రత ఎకువ ఉండడంతో పండుగ రోజు నమాజ్ వేళ ప్రజలకు ఇబ్బంది కలుగకుండా సిద్దిపేట మున్సిపాల్ పాలకవర్గం సహకారంతో పూర్తి సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మైనార్టీలపై ఉందన్నారు. ఆయన ప్రజల మనిషి.. పేదల బాగు కోసం కష్టపడుతున్నారన్నారు. కేసీఆర్ హయాంలో రంజాన్ తోఫా ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తోఫా బంద్ చేసిందన్నారు. బీఆర్ఎస్ను గెలిపించి కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, తంజిం ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు అబ్దుల్ సమీ, ఆసిఫ్, అబ్దుల్ వహీద్, నయ్యర్‌పటేల్, అక్తర్‌పటేల్, అక్బర్ నవాజ్, బాబుజానీ, అజీజ్, జమ్ము, జావీద్, తహెర్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, నాయకులు పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, వజీరుద్దీన్, ఫక్రుద్దీన్, మోయిస్, అరవింద్‌రెడ్డి, నాగరాజురెడ్డి, మల్లికార్జున్, శ్రీనివాస్ ఉన్నారు.