సిద్దిపేట, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉపాధ్యాయుల కృషి కారణంగా కొన్నేండ్లుగా పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా మంచి ఫలితాలు సాధిస్తున్నదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు.శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్ ట్రెస్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి హరీశ్‌రావు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను ఉద్దేశించి హరీశ్‌రావు మాట్లాడుతూ… ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయుల మధ్య తేడాచూపుతూ ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు దురదృష్టకరం అన్నారు.
ఉపాధ్యాయుల విషయంలో సీఎంకు తేడా తగదని, ప్రభుత్వ ఉపాధ్యాయులతో ప్రైవేట్ టీచర్లను పోలుస్తూ తక్కువ చేసి మాట్లాడడం తగదన్నారు. ప్రైవేట్ టీచర్లకు వేతనాలు తకువ ఉండవచ్చు కానీ, సామర్థ్యం విషయంలో ప్రైవేటు టీచర్లు ప్రభుత్వ టీచర్లకు తక్కువేమి కాదన్నారు. ఒకరిని మెచ్చుకునే క్రమంలో ఇంకొకరిని కించపరిచే వ్యాఖ్యలు సీఎం స్థాయి మనిషికి తగవన్నారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో కంటే ప్రైవేట్ పాఠశాలల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నట్లు తెలిపారు. ప్రైవేట్ విద్యావ్యవస్థ తెలంగాణలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.
ప్రైవేటు పాఠశాలలపై చిన్నచూపు తగదని.. ప్రభుత్వ, ప్రైవేట్ సూల్స్ రెండు కండ్లు అన్నారు. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నట్లు హరీశ్‌రావు విమర్శించారు. 10 నెలలుగా నిధులు రావడం లేదన్నారు. బెస్ట్ అవైలబుల్ సూల్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు సొంతంగా తాను ఉచిత బీమా సౌకర్యం కల్పించి ఈ జిల్లా గౌరవం పెంచానన్నారు.
ఈ ఏడాది కూడా రూ.5 లక్షల ఉచిత బీమా పథకం అందిస్తానన్నారు. పిల్లలకు మంచి చదువు అందించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేయడం లేదన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను వెలికి తీసి వారిని మం చి పౌరులుగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. విద్యాభివృద్ధికి కృషిచేస్తానని, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ టీచర్లకు అన్నివేళలా అండగా ఉంటానని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, ట్రెస్మా నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లాలోని ప్రైవే ట్ పాఠశాలల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.