సిద్దిపేట, నవంబర్ 25: కాంగ్రెస్ పాలనలో సర్కార్ వైద్యం నిర్వీర్యమైందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 104 మందికి రూ. 25 లక్షల సీఎంఆర్ఎఫ్ చెకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..నియోజకవర్గంలో ఇప్పటివరకు 9,800 మందికి సీఎంఆర్ఎఫ్ చెకులను అందించామన్నారు. కాంగ్రెస్ పాలనలో నేను పోను బిడ్డో సరారు దవాఖానకు అనే మాట ప్రజల్లో మళ్లీ మొదలైందన్నారు. ఈ పరిస్థితి ప్రభుత్వ దవాఖానల్లో తెలంగాణ రాకముందు ఉండేదన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో మందులు లేవని, కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు ఇవ్వడం బంద్ చేశారన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో వైద్యాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. రూ.24 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరు చేస్తే దానిని రద్దు చేసి హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించారన్నారు. సిద్దిపేట ప్రజల ప్రాణాలను కాపాడాలని నేను మంజురూ చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. సిద్దిపేట ప్రజల ఆరోగ్యం కోసం వెయ్యి పడకల దవాఖానను మంజూరు చేస్తే ప్రభుత్వం అర్ధంతరంగా పనులను అపివేసిందన్నారు. క్యాన్సర్ కిమొథెరపీ, రేడీయోథెరపీని కూడా రద్దు చేశారన్నారు.
జిల్లాలో రూ.200 కోట్ల రోడ్డు పనులు రద్దు చేసి మంత్రి సీతక ములుగుకు తరలించుకపోతున్నరని తెలిపారు. సిద్దిపేటకు మంజూరైయిన నిధులను రద్దు చేస్తున్నారని, వెటర్నరీ కళాశాలను రద్దు చేశారని విమర్శించారు. సిద్దిపేటను జిల్లా చేసి గోదావరి జలాలు, రైలు, సుడాను ఏర్పాటు చేసి అగ్రగామిగా నిలిపామన్నారు. సిద్దిపేటలో గోదావరి జలాలతో కరువు అనేది లేకుండా చేశామని, అన్ని రంగాల్లో సిద్దిపేట అభివృద్ధి చెందిందన్నారు. సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ నాయకులు ఏ మొహం పెట్టుకొని ఇక్కడ తిరుగుతారన్నారు. సిద్దిపేట కాంగ్రెస్ నాయకులకు సోయి లేదా…సిద్దిపేట అభివృద్ధికి మోకాళ్లు అడ్డుపెట్టడం కాంగ్రెస్ నైజామా అని ప్రశ్నించారు.
నాడు ప్రతిపక్షం లో ఉండి మన అభివృద్ధిని చూసి, కండ్లలో నిప్పులు పోసుకున్నారు.. నేడు నిధులు ఇవ్వకుండా మొకాలు అడ్డు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులకు డబుల్ పనులు చేసి, ప్రేమ పొందాలన్నారు. సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటే రద్దు చేసిన పనులు ఇవ్వకుంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అసెంబ్లీ లో కొట్లాడుతా..అవసరం అయితే కోర్టుకు వెళ్తానన్నారు. సిద్దిపేట అభివృద్ధి కోసం, ప్రజల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమేనన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, సుడా మాజీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగింటి కనుకరాజులతోపాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.