అందోల్, నవంబర్ 21: పెద్దమ్మ తల్లి దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అమ్మవారిని మొక్కుకున్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం మాసాన్‌పల్లిలో పెద్దమ్మ తల్లి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌తో హాజరై అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈ ఉత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత చెరువులను ఆధునీకరించడంతో మత్స్యకారులకు ఉపాధి మెరుపడిందన్నారు.
కేసీఆర్ ముందుచూపుతో చెరువులు పూర్వవైభవం సంతరించుకున్నాయని, మత్స్య సంపద పెరిగి మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో కాళేశ్వరం నీటితో ఈ ప్రాంతం మరింత సస్యశ్యామలం అయ్యేలా పెద్దమ్మ తల్లి చల్లని దీవెనలు ఉండాలని మొక్కుకున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. ఉత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేసి అన్నదానం చేశారు. కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బండ ప్రకాష్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, మాజీ వైస్ చైర్మన్ జైపాల్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు నారాయణ, నాగభూషణం, నాయకులు ఉదయ్‌భాస్కర్, ఆదర్శ్‌రెడ్డి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.