సిద్దిపేట ప్రతినిధి/సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రజాప్రతినిధులు, అధికారు ల సమన్వయంతో పార్టీలకతీతంగా సిద్దిపేట జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని అటవీ పర్యావరణ, దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్లో ఆమె అధ్యక్షతన జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య, ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వ్యవసాయం, మత్స్య, పౌర సరఫరా లు, జిల్లా గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ, అటవీ, వైద్య, ఆరోగ్యం, సెట్విన్, విద్య, విద్యుత్ తదితరశాఖల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిపై సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ..వివిధ పథకాల అమలు కాలపరిమితిలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పా ట్లు చేయాలని, ప్రభుత్వం సన్నరకం వరికి రూ.500 బోనస్ ప్రకటించిందని, పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
అర్హత ఉన్న వారందరికీ రూ.500 సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ అందేలా పౌరసరఫరాల అధికారులు చర్యలు తీసుకోవాలన్నా రు.14 రకాల యూనిట్ల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు లబ్ధిపొందేలా అమలు చేయాలన్నారు. సర్పంచ్‌లు లేనందున ప్రత్యేకాధికారులు చొరవ తీసుకొని అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలోని దవాఖానలో అవసరమైనంత మేరకు డయాలసిస్ బెడ్స్ పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్య తోపాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అం దించాలన్నారు. సెట్విన్ ద్వారా యువత, మహిళలకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలన్నారు.
ఆరుగ్యారెంటీలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ స్థాయిలో సాధ్యమయ్యే పనులను వెంటనే చేపట్టి పూర్తిచేయాలని, సమావేశంలో చర్చించిన మిగతా పనుల ప్రతిపాదనలు అందజేయాలన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించే గ్రీవెన్స్ దరఖాస్తులను త్వరగా పరిషరించాలన్నారు. భవిష్యత్‌లో సిద్దిపేట జిల్లా అభివృద్ధిపై రెండు, మూడు నెలలకు ఒకసారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకుందామన్నారు.ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదని.. త్వరలోనే వస్తాయన్నారు. ప్రభుత్వ పథకాలకు సం బంధించి ఫ్యామిలీకి ఒక కార్డు ఇచ్చేందుకు ప్రభు త్వం త్వరలోనే శ్రీకారం చుట్టబోతోందన్నారు.
సిద్దిపేట జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశానికి రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గైర్హాజరయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ హాజరయ్యారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కాలేదు.
రూ.2లక్షలపైన రుణం ఉన్న రైతులకు సంబంధిం చి సరైన మార్గదర్శకాలు ఇవ్వాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఫసల్ బీమా యోజన పథకంలో చాలా ఇబ్బందులు ఉన్నందున..రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించిందా అని అడిగారు. చేర్యాలలోని ప్రభుత్వ దవాఖాన ల్లో సరైన వైద్యులతో పాటు మందులు లేవన్నా రు. చేర్యాల మీదుగా నిర్మాణమవుతున్న రహదారి వెంట మొక్కలు నా టాలన్నారు. కొత్తగా పట్టా పుస్తకాలు పొం దిన రైతులందరికీ రైతుబీమా వర్తింపచేయాలన్నారు. విద్యుదాఘాతంతో లైన్మెన్ చనిపోతే ఎందుకు స్పందించలేదని అధికారులను ప్రశ్నించారు. బతుకమ్మ పండుగకు గ్రామాల్లోని స్తంభాలకు లైటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు.
మహాలక్ష్మీ పథకంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యా స్ సబ్సిడీ అందరికీ రావడంలేదని దుబ్బా క ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సన్నవడ్లు పండించే రైతుల సంఖ్య అధికారుల వద్ద ఉందా..రూ.500 బోనస్ సన్న వడ్లకు ఇస్తారా.. దొడ్డు వడ్లకు ఇస్తారా అని అడిగారు. దుబ్బాకలోని 100 పడకల దవాఖానలో సరైన సదుపాయాలు లేవని వెంటనే ఆ సమస్య పరిష్కరించాలన్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయు లుంటే విద్యార్థులు లేరని, మరో పాఠశాలలో విద్యార్థులు ఎక్కువగా ఉంటే ఉపాధ్యాయులు లేరన్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీకి సంబంధించి మంజూరైన రోడ్లను రద్దు చేశారని..వాటిని మళ్లీ మంజూరు చేసేలా చొరవ తీసుకోవాలని ఆయన మంత్రి, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో ఉన్న సమస్యలపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. జిల్లాలో మూడు పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయని.. వాటి పరిధిలో సొసైటీలు ఏర్పాటు చేయాలన్నారు. చేపలు పట్టుకునేందుకు తొగుట మండలం తుక్కాపూర్ గ్రామస్తులకు అవకాశం కల్పించాలన్నారు. ప్లాస్టిక్ నుంచి డీజిల్ తయా రు చేసే యూనిట్‌కు ప్రోత్సాహం అందించాలన్నారు. పండుగల కోసం గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలన్నారు.