సిద్దిపేట, నవంబర్ 8 : సిద్దిపేట ప్రాంతానికి గోదావరి జలాలు తెచ్చానని, ఈ ప్రాంతాన్ని తన శక్తిమేర అభివృద్ధి చేశానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎంఆర్ఎఫ్ చెకులు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సిద్దిపేటలో 10 వేల కుటుంబాలకు 35 కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ సాయం అందించినట్లు తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలని సొంత డబ్బులతో విద్యార్థులకు టిఫిన్ పెట్టించి స్టడీ మెటీరియల్ అందించి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపినట్లు గుర్తుచేశారు. ఎల్వీ ప్రసాద్ దవాఖాన ఏర్పాటు చేసి ఎంతోమంది పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించినట్లు తెలిపారు.
ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా బీఫార్మసీ కాలేజీని సిద్దిపేటలో ఏర్పాటు చేయించి ఇకడ విద్యార్థులకు బీఫార్మసీ విద్యను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. సత్యసాయిబాబా ట్రస్ట్ ద్వారా చిన్న పిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు చేసే దవాఖాన ఏర్పాటు చేసుకున్నామన్నారు. సిద్దిపేటకు గోదావరి జలాలను, రైల్వే లైన్ తీసుకువచ్చి దశాబ్దాల కలను నెరవేర్చినట్లు హరీశ్‌రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను సిద్దిపేటకు తెవచ్చి వానకాలంలో లక్ష ఎకరాలకు, యా సంగిలో లక్ష ఎరాలకు సాగునీటిని అందించామన్నారు.
పామాయిల్ ఫ్యాక్టరీని నర్మెటలో ఏర్పాటు చేయించి సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ రాకపోతే నువ్వు ముఖ్యమంత్రివి అయ్యేవాడివా? అని రేవంత్‌ను ప్రశ్నించారు. ఇప్పుడు పంట చేతికి వచ్చినా రైతుబంధు రాలేదన్నారు. కేసీఆర్ బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పం డుగలకు బట్టలు పంపిణీ చేసేవారన్నారు. రెండు చీరలు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక చీర కూడా ఇవ్వలేదని విమర్శించారు.
అవ్వతాతలకు రూ.4 వేల పింఛన్ ఇస్తానని చెప్పి, ఉన్న రూ.2 వేల పెన్షన్ కూడా రెండు నెలలు ఎగ్గొట్టాడన్నారు. ఏప్రిల్‌లో, ఆగస్టులో రెండు నెలల పింఛన్‌ను కాంగ్రెస్ సరారు ఎగ్గొట్టిందన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు నాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోలు జరిగేదని, రెండు రోజులకే రైతుల అకౌంట్లో డబ్బు లు పడేవన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసినందుకు మోసం చేశారని రైతులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదని, హామీలను అమలు చేసేవరకు పోరాడుతుందని హరీశ్‌రావు అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.