హత్నూర, నవంబర్ 21: చేపల పెంపకంతో మత్స్యకారులు ఉపాధి పొందాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హత్నూర పెద్ద చెరువులో 42 వేలు, సికిందలాపూర్ చెరువులో 50 వేలు చేప పిల్లలను ఆమె వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో మత్స్యకారులకు 100 శాతం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయగా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అందులో 50 శాతం మాత్రమే చేప పిల్లల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నదని ఆరోపించారు.
మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. జిల్లాలో 79 పెద్ద చెరువుల్లో 50 శాతమే చేప పిల్లలను వదులుతున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి నరసింహరావు తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా బొచ్చ, రవుటా, మిరిగాల రకాల చేపపిల్లలను పంపి ణీ చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింహులు, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీశైలం, నాయకులు ఆగమయ్య, నరేందర్, భిక్షపతి, వీరేందర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
శివ్వంపేట, నవంబర్ 21: బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంపిణీ చేసిన చేప పిల్లలకంటే కాంగ్రెస్ హయాంలో తక్కువ సంఖ్యలో పంపిణీ చేసినట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం చెరువులో ఎమ్మెల్యే చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేపపిల్లలు తక్కువగా వస్తున్నాయని, గతంలో గోమారం చెరువులో లక్షా 80వేలు వస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 50వేల చేపపిల్లలు మాత్రమే పంపడం విడ్డూరమన్నారు.
మత్స్య సంపదతో మత్స్యకారులను ఆదుకునేలా ఉండాలి కానీ కుదించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు నెలలు ఆలస్యంగా పంపిణీ చేయడంతో మత్స్యకారులను ఇబ్బంది పెట్టిననట్టేనన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యుడు మన్సూర్, నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమోద్దీన్, మాజీ సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి, మత్స్య పరిశ్రమ సహకార సంఘం గోమారం సొసైటీ చైర్మన్ కుంట లక్ష్మణ్ పాల్గొన్నారు.