పటాన్చెరు, జూలై 11 : నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలకు భరోసా ఇస్తూ, ప్రతి పేదవాడి ఆర్థిక అభ్యున్నతికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి ఇంట్లో సంక్షేమం, ఇంటి ముంగిట అభివృద్ధి లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే మూడు నెలల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ దళితబంధు, బీసీ కుల వృత్తిదారుల ఆర్థికసాయం, గృహలక్ష్మి పథకాలు అందజే స్తామన్నారు. గ్రామాలతోపాటు పట్టణాల్లో అర్హులైన పేదలను గుర్తించి 75గజాల ఇంటి స్థలం ఇవ్వడానికి రెవెన్యూ అధికారు లతో కలిసి ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలన్నారు.
పటాన్చెరు నియోజకవర్గంలోని పటాన్చెరు, జిన్నారం, గుమ్మడిదల మండలాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నట్లు తెలిపారు. వందమందికి దళితబంధు ద్వారా రూ. 10లక్షల ఆర్థికసాయం అందజేశామన్నారు. రెండో విడత దళితబంధులో 1100 యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. బీసీ కుల వృత్తిదారులకు రూ.లక్ష ఆర్థికసాయం కోసం 1722 మందిని అర్హులుగా గుర్తించామని ఎమ్మెల్యే అన్నారు. సొంతజాగా ఉన్నవారికి గృహలక్ష్మి పథకంలో రూ. 3లక్షల ఆర్థికసాయం చేస్తామన్నారు. దళితబం ధు, బీసీబీసీ కుల వృత్తిదారులకు ఆర్థికసాయం, గృహలక్ష్మి పథకాల లబ్ధ్దిదారులను గుర్తించాలని అధికారులకు సూచించారు. 75 గజాల స్థలం ఉన్నవారికి పట్టా ఇస్తామన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని యువతీయువకులకు డ్రైవింగ్ లైసెన్స్ ఉచితంగా ఇప్పిస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చారు. నియోజకవర్గంలోని 4 వేల మంది దివ్యాంగులకు రూ.4వేల పింఛన్ ఇస్తు న్నట్లు తెలిపారు. జర్నలిస్టులకు నెలాఖరులోగా ఇంటి స్థలం పంపిణీ చేస్తామని, ఇందుకు తహసీల్దార్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ వచ్చేలోపు లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. సమిష్టిగా పనిచేస్తేనే విజయాలు సాధ్యమన్నారు.
సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌రావు, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈడీ జగదీశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చారి, తహసీల్దార్ పరమేశం, ఎంపీడీవో బన్సీలాల్, జడ్పీటీసీలు సుధాకర్‌రెడ్డి, కుమార్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్లు లలితాసోమిరెడ్డి, తమ్మల పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు సింధూఆదర్శ్‌రెడ్డి, మెట్టు కుమార్‌యాదవ్, పుష్పానగేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, నాయకులు కొలన్బాల్రెడ్డి, దశరథరెడ్డి, వెంకట్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, చంద్రారెడ్డి, వెంకటేశ్‌గౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, అమీన్‌ఫూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింహగౌడ్, సర్పంచ్‌లు ఎర్ర భాగ్యలక్ష్మి, ఉపేందర్ముదిరాజ్, సుధీర్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, అంతిరెడ్డి, ఉప సర్పంచ్ వడ్డె కుమార్, ఎంపీటీసీలు మన్నెరాజు, భిక్షపతి పాల్గొన్నారు.