సిద్దిపేట, జనవరి 26 : పాఠశాలల్లో స్పెషల్ స్టడీతో పాటు ఇంట్లో డిజిటల్ స్టడీ ఉండాలనే ఉద్దేశంతో ‘డిజిటల్ కంటెంట్ బుక్స్ పంపిణీ చేస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట గర్ల్స్ హైసూల్లో టెన్త్ విద్యార్థినులకు శుక్రవారం ఆయన డిజిటల్ కంటెంట్ బుక్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ సిద్దిపేట గర్ల్స్ హైసూల్ను కార్పొరేట్లాగా తయారు చేసుకున్నామని గుర్తుచేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో మేధస్సుకు పదును పెట్టే విధంగా ఈ బుక్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్దిపేట అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందని, అదే స్ఫూర్తితో విద్యారంగంలో ముందుండాలన్నారు. నేటి యువతరం డిజిటల్ , మొబైల్ వైపు విస్తరిస్తోందన్నారు. గత సంవత్సరం టెన్త్ ఫలితాలను రెట్టింపు చేసేలా ఇదొక చిరు ప్రయత్నం చేస్తున్నామన్నారు. గత సంవత్సరం నుంచి డిజిటల్ కంటెంట్ రూపంలో జిల్లాలోని టెన్త్ విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేస్తున్నామన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థులకు (2516 మంది) బుక్స్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్రంలోనే సిద్దిపేట నియోజకవర్గం 100% ఫలితాలు సాధించి అగ్రస్థానంలో ఉండాలనేదే నా తాపత్రయం, అందుకు అందరం కలిసికట్టుగా కృషిచేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
టెన్త్ చదువుతున్న విద్యార్థినులతో ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడారు. “పొద్దున్నే అమ్మ నిద్ర లేపి చదివిస్తుందా….నేను పంపిన ఉత్తరం మీ అమ్మా నాన్నలకు అందిందా.. టీవీలు బంద్చేస్తున్నారా.. ఫోన్లు చూస్తున్నారా.. కేర్ టీచర్ చదివిస్తున్నారా”..అని అడిగారు. ‘మీరంతా నా పిల్లలుగా ఇంత ప్రయత్నం చేస్తున్నా.. మీ భవిష్యత్ కోసం.. తల్లిదండ్రుల ఆశయాలు, మీరు చదువుకున్న పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నా’..అని ఎమ్మెల్యే అన్నారు.
మర్కూక్, జనవరి 26 : ‘ఆరు గ్యారెంటీలు కాదు.. 13 గ్యారెంటీలను అమలు చేయాలి. గెలిచిన వాళ్లకు ఓపిక ఉండాలి. ప్రతి పక్షాలకు అవకాశం ఇవ్వాలి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి అవకాశాలు ఇవ్వడం లేదు’..అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో బీఆర్ఎస్ పార్లమెంట్ సమావేశం నిర్వహించగా తన్నీరు హరీశ్‌రావు ఫాంహౌస్ బయట విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ను ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేది కాదన్నారు. కేసీఆర్‌పై కాంగ్రెస్ మంత్రులు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.