జహీరాబాద్, సెప్టెంబర్ 21: ప్రభుత్వ నిర్వాకంతో దసరా,బతుకమ్మ పండుగల వేళ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. వేతనాల కోసం మిషన్ భగీరథ కార్మికులు తాగునీటి సరఫరాను నిలిపివేసి పోరుబాట పట్టారు. ఫలితంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం, అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండలాల్లో ప్రజలు క ‘న్నీటి కష్టాల’ పాలువుతున్నారు.
శనివారం అర్ధరాత్రి నుంచి ఆయా మండలాల్లోని 73 గ్రామాలకు మిషన్ భగీరథ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సకాలంలో కార్మికులకు వేతనాలు చెల్లించడంలో సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ మిషన్ భగీరథ జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆయా మండలాలకు న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్ శివారులోని మిషన్ భగీరథ ఫిల్టర్‌బెడ్ నుంచి ప్రతిరోజు తాగునీరు సరఫరా జరుగుతుంది. తాగునీటి సరఫరా చేసేందుకు క్షేత్రస్థాయిలో పనిచేసే తాత్కాలిక కార్మికులకు ఎనిమిది నెలలుగా కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదు.
పలుసార్లు సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌కు కార్మికులు గోడు మొరపెట్టుకున్నారు. అయినా పట్టించుకోక పోవడంతోనే తాగునీటి సరఫరాను నిలిపివేసి ఆందోళనకు దిగాల్సి వచ్చిందని కార్మికులు వాపోయారు. సంబంధిత జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, నెలనెలా వేతనం రాక కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమకు చెల్లించాల్సిన 8 నెలల వేతనాలతో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగా తమ వేతనాన్ని రూ. 9,500 నుంచి రూ.18 వేల పెంచాలని, హెల్త్త్కార్డు, ఐడీకార్డులు మంజూరు చేయాలని, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వేతనాల కోసం కార్మికులు ఆందోళన చేస్తుండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కలెక్టర్, మిషన్ భగీరథ అధికారులు ఆదేశాల మేరకు రాఘవపూర్ మిషన్ భగీరథ ఫిల్లర్ బెడ్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పండుగ పూట నీళ్ల కోసం పాట్లు…
జీతాల కోసం మిషన్ భగీరథ కార్మికులు ఆందోళనకు దిగడంతో తాగునీటి సరఫరా నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దసరా, బతుకమ్మ పండుగలు కావడంతో ఇండ్లలో భవానీమాత ప్రతిష్ఠించేందుకు, ఇండ్లను శుద్ధి చేయడంతో పాటు కలరింగ్, బట్టలను ఉతికేందుకు వాగులు, కుంటలు బోరు, బావులకు ఆశ్రయిస్తున్నామని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయమై మిషన్ భగీరథ అధికారుల దృష్టికి ‘నమస్తే తెలంగాణ’ తీసుకెళ్ల్లగా.. మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోయింది మాట వాస్తవమేనని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిషన్ భగీరథ తాత్కాలిక కార్మికుల జీతాలు చెల్లించేందుకు సంబంధిత జిల్లా అధికారులు కాంట్రాక్టర్‌తో చర్చిస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం ఆదుకోవాలి..
ప్రతినెలా వేతనం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇచ్చే ఆరకొర వేతనాన్ని ఏడు నెలల పాటు చెల్లించకుంటే ఎలా బతికేది. అధికారులు, కాంట్రాక్టర్ కలిసి కార్మికులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ. 9,500 వేతనాన్ని రూ.18 వేలకు పెంచాలి. అలాగే హెల్త్త్కార్డు, ఐడీకార్డులు జారీచేయాలి. ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలి. మిషన్ భగీరథ అధికారులు మా సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన చేస్తాం.
– నర్సింలు, మిషన్ భగీరథ కార్మికుడు, న్యాల్కల్ మండలం(సంగారెడ్డి జిల్లా)