సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 14: జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో రాష్ట్ర హోం, జైళ్లు, అగ్నిమాపక శాఖ మంత్రి మహమూద్ అలీ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఉదయం 11.10 నుంచి 11.30 గంటల వరకు మంత్రి సందేశం, 11.30 నుంచి 11.45 గంటల వరకు స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు సన్మానం, 11.45 నుంచి 12.00 గంటల వరకు ప్రభుత్వ పథకాలపై శకటాల ప్రదర్శన, మధ్యాహ్నం 12.00 నుంచి 12.15 గంటల వరకు స్థానిక విద్యా సంస్థల బాలబాలికల సాంస్కృతిక ప్రదర్శనలు, 12.30 గంటల వరకు ప్రశంసా పత్రాల పంపిణీ, అనంతరం మంత్రితో పాటు అతిథులు, ఆహ్వానితులు స్టాళ్ల ప్రదర్శన ఉంటుందని కలెక్టర్ శరత్ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ నిర్వహణలో భాగంగా పోలీసు పరేడ్ మైదానంలో జరిగే వేడుకలకు మంత్రి మహమూద్ అలీని సంగారెడ్డి ఆర్డీవో రవీందర్రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు సోమవారం మంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఏర్పాట్లు పూర్తి..
సంగారెడ్డి జిల్లా పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వాతంత్య్రం సిద్ధించి 76 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించనున్నారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాల ప్రదర్శనతో పాటు ఆయా శాఖల అధికారులు స్టాళ్లను ఏర్పాటు చేశారు.
ర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 14: కలెక్టరేట్లో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం పరిశీలించారు. ఈ సందపర్భంగా వివిధ శాఖల ప్రగతిపై రూపొందించే ఎగ్జిబిట్లపై తగు సూచనలు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జెండావిష్కరణకు హాజరవుతారని, వేడుకలను తిలకించడానికి వచ్చే అతిథులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.