పటాన్చెరు, డిసెంబర్ 20: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్, గడ్డపోతారం, గుమ్మడిదల గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మారుస్తామని శుక్రవారం అసెంబ్లీలో ఐటీ, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఈ ప్రకటనతో మూడు గ్రామపంచాయతీలతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. శాస్త్రీయత లేకుండా రాజకీయ లబ్ధి కోసం ఈ గ్రామాలను మున్సిపాలిటీలుగా మారుస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పం చాయతీల జనాభా, అవసరాల దృష్ట్యా నగర పంచాయతీలుగా మార్చి, ఆ తర్వాత క్రమంగా మున్సిపాలిటీలుగా మారుస్తారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవేవి పాటించకుండా రాజకీయ లబ్ధికోసం బల్దియాలుగా మారుస్తుండడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. మూడు నెలల క్రితం తెల్లాపూర్ మున్సిపాలిటీలోకి ఐదు పంచాయతీలను, అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోకి ఆరు గ్రామ పంచాయతీలను ప్రభు త్వం విలీనం చేసింది.
విలీనమైన గ్రామాల్లో మున్సిపల్ సేవలు ప్రజలకు సరిగ్గా అందడం లేదు. ముత్తంగి గ్రామానికి దసరా తర్వాత తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దాదాపు 75రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. ముత్తంగిలో చెత్త నిర్వహ ణ, మురుగునీటి వ్యవస్థ దారుణంగా తయారైంది. అధికారుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రజలకు సేవలు దూరమయ్యాయి. ముత్తంగిని చూస్తున్న గ్రామాల ప్రజలు కొత్త మున్సిపాలిటీలను ఒప్పుకోమని చెబుతున్నారు. కేవలం పన్నుల కోసమే ఈ గ్రామాలను మున్సిపాలిటీలుగా మారుస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
పటాన్చెరు నియోజకవర్గంలో గుమ్మడిదల గ్రామ పం చాయతీ, మండల కేంద్రం కూడాను. గుమ్మడిదల మండలంలోని దోమడుగు, గుమ్మడిదల, బొంతపల్లి, అన్నారం, వీరన్నగూడెం గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తారని సమాచారం. జిన్నారం మండలంలోని గడ్డపోతారం, చెట్లపోతారం, అలీనగర్, కిష్టయ్యపల్లి, దాచారం ఐదు గ్రామాలను కలిపి గడ్డపోతారం మున్సిపాలిటీగా చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలను ఇస్నాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేయనున్నట్లు సమాచారం. పక్కనే ఉన్న రుద్రారం, లక్డారం గ్రామాలను కలుపాలని అధికార పార్టీ నాయకులు కోరుతున్నట్లు తెలిసింది. గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలుగా చేసినా సరిపోను జనాభా లేదు. అంతగా అనుకుంటే నగర పంచాయితీలుగా మాత్రం చేయవచ్చు. చదరపు కిలోమీటర్‌కు వెయ్యి జనసాంద్రత ఉంటేనే మున్సిపాలిటీలుగా చేయాలనే నిబంధన ఉంది.
మున్సిపాలిటీలుగా మార్పు చెందితే నాణ్యమైన సేవలు పొందుతారని అధికారులు, ప్రభుత్వాలు చెబుతున్నాయి. మూడు నెలల కిత్రం ముత్తంగి గ్రామాన్ని తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేశారు. దసరా పండుగ తరువాత ముత్తంగి గ్రామానికి మిషన్ భగీరథ నుంచి వస్తున్న నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలనే ఆలోచన మున్సిపల్ అధికారుల్లో రాలేదు. జాతీయ రహదారి విస్తరణలో ముత్తంగికి వస్తున్న తాగునీటి పైప్‌లైన్ పగిలిపోయింది. దాని మరమ్మతులకు అటు మిషన్ భగీరత అధికారులు, ఇటు మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోలేదు. పైగా ఈ గ్రామంలో భూగర్భజలాలు కలుషితం అయ్యాయి.
మరోపక్క ముత్తంగిలోను మురుగు నీటి నిర్వహణ విఫలమైంది. తడి,పొడి చెత్తను తీసుకెళ్లి సుచిర్ ఇండియా వెంచర్ ముందు గుంతల్లో పారవేసి తగలబెడుతున్నారు. దీంతో గ్రామం మొత్తం వాయు కాలు ష్యం బారిపడుతున్నది. అక్రమ నిర్మాణాలు పెరిగాయి. ప్రజాసమస్యలను వినే నాధుడే లేడు. పన్నులు అధికంగా ఉండబోతున్నాయని సమాచారం. ఇంటి పర్మిషన్లకు రెట్టింపు డబ్బులు కట్టాల్సి ఉంటున్నది. కేవ లం ట్యాక్సుల కోసం, కొందరు రాజకీయ నాయకుల భవిష్యత్తు కోసం మాత్రమే మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీల ఏర్పాటును వ్యతిరేకిస్తామని ప్రజలు పేర్కొంటున్నారు.