దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
ఏటా ఏడుపాయల జాతరకు రూ.కోటి నిధులు
మహా శివుడి ఆశీస్సులతో కాళేశ్వరం కట్టుకున్నాం
మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతాయి
విలేకరుల సమావేశంలో ఆర్థిక, వైద్యారోగ్యల శాఖల మంత్రి హరీశ్‌రావు
పాపన్నపేట, మార్చి 1: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఏడుపాయల అభివృద్ధికి పెద్దపీట వేశారని, రానున్న రోజుల్లో ఇక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి చేయనున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీమాత జాతర మంగళవారం ప్రారంభమైంది. మంత్రి హరీశ్‌రావు కుటుంబ సమేతంగా హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి పూజలు నిర్వహించారు. మంత్రి వెంట మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి , జిల్లా కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తదితరులు ఉన్నా రు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు దంపతులకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి విలేకరులతో మా ట్లాడుతూ.. మహాశివుడి ఆశీస్సులతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకుని గోదావరి నీటిని వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామ లం అవుతోందన్నారు. మల్లన్న సాగర్ ద్వారానే 10 జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయని తెలిపారు. గోదావరి జలాలు అర కిలోమీటరు ఎత్తుకు రావడం గొప్ప విషయమన్నారు. అక్కడి నుంచి 618 మీటర్ల ఎత్తున కొండపోచమ్మ సాగర్‌కు తెచ్చుకున్నామని తెలిపారు. గోదావరి నీళ్లు కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్‌కు వస్తున్నాయని, అక్కడి నుంచి 10 జిల్లాలకు చేరుకొని రాష్ట్రం సస్యశ్యామలం కానున్నదని మంత్రి వెల్లడించారు. మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతాయన్నారు.
మల్లన్నసాగర్ నీళ్లు ఘనపూర్ ఆనకట్టకు చేరుకుంటాయని, దీంతో ఏడుపాయల జాతరకు ఎప్పటికీ నీటి కొరత ఉండదన్నారు. గత ప్రభుత్వాల హ యాంలో ఘనపూర్ ఆనకట్టలో సరిగ్గా నీళ్లు లేక రైతులతో పాటు జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులు పాలయ్యే వారని గుర్తు చేశారు. ప్రస్తుతం అలాంటి నీటి బాధలు ఉండబోవన్నారు. ఘనపూర్ ఆనకట్టలో నీళ్లు లేవు అనే మాట గతం, వర్తమానం అంతా సస్యశ్యామలమే అని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వాలు ఆలయాల అభివృద్ధిని పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి విశే ష కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఏడుపాయల ఆలయాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
పోతంశెట్టిపల్లి వైపు నుంచి సీసీ రోడ్డు వేసుకున్నట్లు తెలిపారు. దీని ద్వారా హైదరాబాద్ నుం చి వచ్చే భక్తులకు ఏడుపాయలకు దగ్గరవుతుందన్నారు. ఏటా జాతరకు సీఎం కేసీఆర్ కోటి రూపాయల నిధులు కేటాయిస్తున్నారన్నారు. ఇటీవల మల్లన్నసాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా పర్యాటక అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.1500 కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భం గా గుర్తుచేశారు. ఈ నిధులు మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, అనంతగిరి, కొండపోచమ్మ సాగర్, ఏడుపాయల అభివృద్ధికి కేటాయించినట్లు తెలిపారు. ఇందులో నుం చి ఏడుపాయల అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించారని, వీటి ద్వారా ఫౌంటెన్, కాటేజీలు, గిరిప్రదక్షిణ, రహదారుల ఏర్పాటుతోపాటు వసతుల కల్పనకు కృషిచేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.