హుస్నాబాద్, సెప్టెంబర్ 15: హుస్నాబాద్ నియోజకవర్గంలో వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువు వద్ద మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, ఆర్డీవో రామ్మూర్తి, ఏసీపీ సతీశ్‌తో కలిసి నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జనం కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. నిమజ్జనం చేసే స్థలంలో లైటింగ్, బారికేడ్లు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయిస్తామన్నారు. విగ్రహాలను వాహనాల్లో తీసుకొస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఊరేగింపును ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించుకోవాలన్నారు.
విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉన్నందున, అం దుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పోలీసు అధికారులు, సిబ్బంది శాంతిభద్రతల సమస్య తలెత్తకుం డా చూసుకోవాలన్నారు. మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనితారెడ్డి, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కౌన్సిలర్లు వల్లపు రాజు, భూక్య సరోజన పాల్గొన్నారు.