అక్కన్నపేట, ఆగస్టు 16: యూరిత కొరతపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక మెయిన్‌లో శనివారం ప్రచురితమైన ‘ఇదీ దుస్థితి’ కథనం చర్చనీయాంశమైంది. దీనిపై రాష్ట్ర రవాణా, బీసీ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇదే అంశంపై సిద్దిపేట కలెక్టర్ హైమావతితో పాటు, అక్కన్నపేట మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులతో మంత్రి మాట్లాడినట్లు తెలిసింది. ప్రచురితమైన వార్త కథనంలోని ఫొటోలో ఉన్న మహిళా రైతు ఎవరు, ఆమెకు సంబంధించిన వ్యవసాయ భూమి వివరాలు, కావాల్సిన ఎరువులు, ఇతరత్రా పూర్తి వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు ద్వారా జిల్లా కలెక్టర్ హైమావతి తెలుసుకున్నట్లు తెలిసింది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వాలని మండల వ్యవసాయాధికారిని ఆమె ఆదేశించారు. కాగా, అక్కన్నపేట మండలంలో యూరియా సరఫరాపై ఏవో తస్లీమాను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా జూన్-సెప్టెంబర్ మధ్య కాలానికి మండలానికి 2800 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటి వరకు 800 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చినట్లు తెలిపారు. రైతులు అవసరం మేరకే యూరియ తీసుకోకుండా మొత్తం ఒకేసారి తీసుకోవడానికి వస్తుండడంతో కొరత ఏర్పడుతున్నట్లు తెలిపారు.
ఇండెంట్ పెట్టామని, రాగానే పంపిణీ చేస్తామన్నారు. ఆగస్టు నెలకు సంబంధించి 980 టన్నుల యూరియా రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 350 టన్నులు వచ్చిందన్నారు. కాంగ్రెస్ నాయకులు మా త్రం అక్కన్నపేట మండలంలో యూరియా కొరత లేదని శనివారం అక్కనపేటలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. మండలంలో యూరియా కొరత ఉందని అనడం అవాస్తవం అని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అయిలయ్య, అక్కన్నపేట మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి ప్రెస్మీట్లో పేర్కొన్నారు. అక్కన్నపేట మండలంలో 32.4 టన్నుల యూరి యా నిల్వలు ఉన్నాయన్నారు. యూరియా అనేది కేంద్రం పరిధిలోని అంశం అని, కావాలనే బీజేపీ ప్రభుత్వం కక్షసాధిస్తూ రాష్ర్టానికి సరిపడా యూరియా పంపడం లేదని వారు ఆరోపించారు.