చేర్యాల, అక్టోబర్ 27 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం వరకు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలకు బంగారు కిరీటాలు తయారు చేయించి సమర్పించుకుంటామని దేవాదాయ, అటవీశాఖల మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆదివారం కొమురవెల్లి మల్లికార్జున స్వామిని మంత్రి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రికి ఆలయవర్గాలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడారు. మల్లన్న ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు.
కొమురవెల్లి మల్లన్న కల్యాణం వరకు 50గదుల ధర్మశాల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు.మల్లన్న జాతరకు వచ్చే భక్తులకు గదుల సౌకర్యం కల్పించేందుకు దాతల సహకారంతో ధర్మశాల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. డిసెంబర్ 28న జరిగే కొమురవెల్లి మల్లన్న కల్యాణం వరకు అమ్మవార్లకు కిరీటాలు తయారు చేయించేందుకు స్వామి వారికి సంబంధించిన బంగారు మిల్ట్ చేయించామని, కల్యాణం వరకు కిరీటాలు తయా రు చేయిస్తామన్నారు.పూజల అనంతరం మంత్రికి ఆలయ ప్రధానార్చకుడు, ఏఈవో శ్రీనివాస్ మల్లికార్జున స్వామి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
కొమురవెల్లి మల్లన్న దర్శనానికి మంత్రి కొండా సురేఖ వస్తున్నారని తెలిసిన ఆలయ అధికారులు ఆదివారం ఉదయం నుంచి భక్తుల వసతులు మరిచి ఆమె కోసం ఏర్పాట్లు చేశారు.మంత్రి వచ్చే దారి గుండా ఎల్లమ్మ దేవాలయానికి కలినడకన వెళ్తున్న భక్తులను పోలీసులు వెనక్కి తిప్పి పంపించడంతో ఎల్లమ్మ వద్దకు వెళ్లేందుకు భక్తులు తిప్పలు పడ్డారు. దేవాలయం వద్ద వాహన పూజలకు వచ్చిన భక్తులను సైతం ఆలయ సిబ్బంది, పోలీసులు వెనక్కి పంపించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఆలయ అధికారులు హడావిడి చేసి తమకు ఇబ్బందులు కలిగించడం తగదని భక్తులు పెదవి విరిచారు.