ఆరోగ్యవంతమైన సమాజం కోసం తనవంతు కృషి
పంట సాగులో విప్లవాత్మక మార్పులు..
ఎడెకరాల్లో విభిన్న పంటలు..
పుడమిపుత్ర అవార్డు అందజేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి
దుబ్బాక, ఫిబ్రవరి 8 : ప్రస్తుతం తినే తిండి.. తాగే నీరు.. పీల్చే గాలి అన్నీ కలుషితమయ్యాయి. దీంతో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. వీటిని నయం చేసుకునేందుకు దవాఖానల్లో లక్షల రూపాయలను సమర్పిస్తున్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రభుత్వం ప్రజలను చైతన్యపరుస్తూనే ఉన్నప్పటికీ.. మనం తీసుకునే ఆహారం నాణ్యతతో ఉంటేనే ఆరోగ్యం బాగుంటుందని ఓ యువకుడు తనవంతుగా ప్రజలను చైతన్యపరుస్తున్నాడు. పట్టణంలో లక్షల రూపాయల జీతాన్ని వదులుకుని, స్వగ్రామానికి వచ్చి ఎవుసం చేస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్‌కు చెందిన బొంగురం నాగరాజు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్‌కు చెందిన బొంగురం నాగరాజు (29) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు నాగరాజు. అనంతరం భారత్ బయోటెక్‌లో పరిశోధన అభివృద్ధి విభాగంలో ఉద్యోగం చేశాడు. ఈ సమయంలో ఓ పక్క మంచి ఉద్యోగం.. విలాసవంతమైన జీవితం గడుపుతున్నప్పటికీ ఆయనకు అవేవీ సంతృప్తినివ్వలేదు. రెండు సంవత్సరాల క్రితం నాగరాజు తండ్రి రాజిరెడ్డికి షుగర్ వ్యాధి (మధుమేహం) రావటంతో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. నాగరాజు తాత రాంరెడ్డి మధుమేహం వ్యాధితో మృతి చెందాడు. ప్రమాదకరమైన మధుమేహం, క్యాన్సర్ వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే సేంద్రియ ఎరువులతో పండించిన పంటలే శ్రేయస్కరమని తెలుసుకున్నాడు. రసాయన ఎరువులు, ఫర్టిలైజర్స్‌తో పండించిన పంటలు ఆరోగ్యానికి నష్టం చేస్తాయని, సేంద్రియ ఎరువులతో పండించిన పంటలతోనే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వివరించేవాడు. అయితే, నాగరాజు సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేసే ముందు మధ్యప్రదేశ్‌లో ఆకాశ్ చౌరాశ్య, సుభాశ్ పాలేకర్ వద్ద సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ తీసుకున్నాడు. జీవ ఎరువులను సొంతంగా తయారు చేసుకుని, వాటిని తాను సాగు చేస్తున్న పంటలపై ఉపయోగిస్తున్నాడు.
సాగు చేస్తున్న పంటలు..
తన ఏడెకరాల భూమిలో మైసూర్ మల్లిక, దాసుమతి, కూజీపటాలియా రకాల వరి పంటలను పండిస్తున్నాడు. అలాగే, అంతర్ పంటలుగా కూరగాయలు బెండ, టమాటా, క్యారెట్, మిర్చి, పసుపు, అల్లం, సొరకాయ, చిక్కుడు, ఉల్లి, వెల్లుల్లి, కంది, పెసర, బీరకాయలతో పాటు ఆకుకూరలు తోటకూర, కొత్తిమీర, మెంతి, పాలకూర సాగు చేస్తున్నాడు. అంతేకాకుండా మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వింగుడు బీన్స్, బ్లాక్ రైస్, రెడ్ రైస్, నవరా విత్తనాలను తీసుకొచ్చి ఇక్కడ పండిస్తున్నాడు.
పొలం వద్దనే సేంద్రియ ఎరువుల తయారీ..
తన పొలం వద్దనే సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటూ పంటలకు వినియోగిస్తున్నాడు. మూడు ఆవులను కొనుగోలు చేసి వ్యవసాయ భూమి వద్ద పశువుల పాకను ఏర్పాటు చేశాడు. వాటి పాలను వాడుకుని, మిగిలినవి పాలకేంద్రంలో విక్రయిస్తున్నారు. ఆవు పేడ, మూత్రంతో జీవామృతం, గో కృపామృతాలను సహజ ఎరువులుగా తయారు చేసి పంటలకు ఉపయోగిస్తున్నాడు. అగ్ని అస్త్రం, దశపర్ని కషాయం తయారు చేస్తూ పంటలకు పిచికారి చేస్తున్నాడు. సేంద్రియ ఎరువులను పంటలకు పారించే సాగునీటిలో మిశ్రమం చేస్తున్నాడు. దీంతో, పంట నాణ్యతగా ఉండడంతో పాటు అధిక దిగుబడులు వస్తున్నాయి.
వరించిన ‘పుడమిపుత్ర’ అవార్డు..
సేంద్రియ సాగు, మిశ్రమ పంటలతో పాటు ఇతర రైతులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్న నాగరాజుకు అవార్డులు వచ్చాయి. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో కేవీకే రైతుమిత్ర సౌజన్యంతో పుడమిపుత్ర పురస్కారానికి నాగరాజు ఎంపికయ్యాడు. గత మార్చి 14న సూర్యాపేట జిల్లాకేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పుడమిపుత్ర అవార్డును నాగరాజుకు అందజేశారు.