పుల్కల్, అక్టోబర్ 16: అందోల్ నియోజకవర్గా న్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మరో పదిరోజుల్లో రూ.168 కోట్లతో సింగూరు కాలువల సీసీ లైనింగ్‌కు శంకుస్థాపన చేస్తానని చెప్పారు. పుల్కల్ మండలం బస్వాపూర్ శివారులోని 417 సర్వే నెంబర్లోని 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్, సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. తొందరలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. సింగూరు కాలువల ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అందోల్ నియోజక వర్గం ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుందన్నారు.
ఈ నియోజకవర్గంలో ఉన్నన్ని విద్యాసంస్థలు మరెక్కడా లేవన్నారు. కాగా ఓ విద్యార్థి మాకు రోడ్డు సౌకర్యం సరిగ్గాలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంత్రి దృష్టికి తీసుకొచ్చింది. ఎక్కడ నుంచి ఎక్కడి వరకు అని మంత్రి అడగ్గా ముదిమాణిక్యం చౌరస్తా నుంచి ఇటిక్యాల మీదుగా జోగిపేట వరకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని విద్యార్థి తెలపడంతో తప్పకుండా ఆ సమస్యను పరిష్కరిస్తానని విద్యార్థినికి హామీనిచ్చారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ అధికారులు, నాయకులు దుర్గారెడ్డి, రాంచంద్రారెడ్డి, ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
సంగారెడ్డి, అక్టోబర్ 16: సంగారెడ్డిలో కలెక్టర్ అధికారి బంగ్లా స్థానంలో నూతన భవనం నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.2.50 కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించనున్న కొత్త కలెక్టర్ నివాసం, క్యాంపు కార్యాలయానికి ఎంపీ సురేష్‌శెట్కార్, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ చెన్నూరి రూపేశ్, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డిలతో కలిసి మంత్రి భూమిపూజ చేశారు.
సంగారెడ్డిలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం అభినందనీయమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం పట్టణంలోని ఐటీఐ ఎదుట సీఎస్ఐ చర్చ సమీపంలో ట్రిపుల్ ఎస్ ఆధ్వర్యంలో గ్లాన్ ఫార్మా పరిశ్రమ సహకారంతో కొనుగోలు చేసిన ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ బైకులను ఎస్పీ చెన్నూరి రూపేశ్, కలెక్టర్ వల్లూరు క్రాంతిలతో కలిసి మంత్రి ప్రారంభించారు.