న్యాల్కల్, ఆగస్టు 18 : వివిధ రోగాలతో వైద్యం కోసం దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించి మంచిపేరును తీసుకువచ్చేలా కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. మండలంలోని రాఘవపూర్ గ్రామ శివారులోని సిద్ధి సరస్వతీదేవి పంచవటీ క్షేత్ర ఆవరణలో రూ. 8 కోట్లతో 75 పడకలతో నిర్మించిన కాశీనాథ్‌బాబా మల్టీ స్పెషాలటీ దవాఖానను ఆదివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం జహీరాబాద్, బీదర్, నారాయణఖేడ్ ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, పంచవటీ క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్ బాబా ఆధ్వర్యంలో మల్టీ స్పెషాలటీ దవాఖాన ఏర్పాటు చేయడంతో ఆ ఇబ్బందులు దూరం కానున్నాయని తెలిపారు. ఈ దవాఖానకు అంబులెన్స్ మంజూరు చేస్తామని, పారామెడికల్, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
నారాయణఖేడ్-జహీరాబాద్ రూట్లో రాత్రి 9 గంటలకు బస్సును నడిపించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి బస్సును నడిపించేలా చూస్తామన్నారు. అనంతరం క్షేత్రంలో మంత్రి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు.నారాయణఖేడ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు సంజీవ్‌రెడ్డి, విజయ్‌పాల్‌రెడ్డి, నాయకులు ఉజ్వల్‌రెడ్డి, తన్వీర్, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, పంచవటీ క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్‌బాబా తదితరులు పాల్గొన్నారు.