త్వరలో జరగనున్న పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా కేంద్రంలోని వైస్రాయ్ గార్డెన్స్‌లో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మెదక్, హవేళీఘణపూర్ మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్కు గెలుపోటములు కొత్తకాదని, ఇది కేవలం స్పీడు బ్రేకర్ మాత్రమేనన్నారు. తెలంగాణతో బీఆర్ఎస్ది పేగు బంధమని, కేసీఆర్ అంటే నమ్మకం, బీఆర్ఎస్ అంటే విశ్వాసమన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌కు గోదావరి, మెదక్‌కు సింగూరు నీళ్లిచ్చామని, ఏడుపాయల అభివృద్ధికి కేసీఆర్ రూ.100 కోట్లతో జీవో ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెసోళ్లు అధికార దాహంతో ఉన్నారని, రైతుబీమా దండగ అని అసెంబ్లీలో అనడం సిగ్గుచేటన్నారు. ఆ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
మెదక్, (నమస్తే తెలంగాణ)/ మెదక్‌రూరల్, డిసెంబర్ 27: తెలంగాణతో బీఆర్ఎస్ది పేగు బంధమని, కేసీఆర్ అంటే నమ్మకం, బీఆర్ఎస్ అంటే విశ్వాసమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని వైస్రాయ్ గార్డెన్స్‌లో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మెదక్, హవేళీఘణపూర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, దేవేందర్‌రెడ్డిలు పాల్గొన్నారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ ఎన్నికల్లో కష్టపడి పనిచేశారని, కృతజ్ఞతలు చెప్పేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి గెలుపు ఓటములు కొత్తకాదని, ప్రజలు మార్పు కావాలని కాంగ్రెస్‌ను గెలిపించి, ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు మళ్లీ తానే వచ్చి ప్రచారం చేసి బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఆరు అసెంబ్లీ స్థానాలు గెలిచామని, మీరంతా నా కుటుంబ సభ్యులే, మీకు ఏ ఆపద వచ్చినా నేనుంటానని భరోసానిచ్చారు. బీఆర్ఎస్ 20 గంటల కరెంటు ఇచ్చిందని అసెంబ్లీలో కాంగ్రెసోళ్లు చెప్పడం ఎంత వరకు సమంజమన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.50వేల కోట్లు విద్యుత్ శాఖకు ఖర్చు చేసి రైతులకు ఉచిత కరెంటు ఇచ్చామని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు తెచ్చి మెదక్ జిల్లాకు సింగూరు జలాలు ఇచ్చామని తెలిపారు. ఎప్పుడైనా కాంగ్రెసోళ్లు చెక్‌డ్యాంలు కట్టినారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల పట్ల బీఆర్ఎస్ కమిట్మెంట్తో ఉన్నదని తెలిపారు. కాంగ్రెసోళ్లు అధికారం కోసం తహతహలాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని, అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా చేయలేదన్నారు.
కరోనా వచ్చినా రైతులకు రైతుబంధు వేశామని, బీఆర్ఎస్ పాలనలో ఏ ప్రభుత్వ పథకం ఆగలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. రైతుబంధు కింద 13 సార్లు రూ.72వేల కోట్లు ఇచ్చామన్నారు. రైతుబీమా ప్రవేశపెట్టి రైతు కుటుంబాలకు అండగా నిలబడింది బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. కరోనా వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ఆగలేదని పేర్కొన్నారు. రైతుబీమా దండగ అని అసెంబ్లీలో కాంగ్రెసోళ్లు మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, రైతుబీమా పథకాలు ఎన్నికల్లో హామీ ఇవ్వలేదని, అయినా వాటిని కొనసాగించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టోలో 412 హామీలున్నాయని, వాటిలో ఎన్ని అమలు చేస్తారో.. ఎంత వరకు అమలవుతాయో చూద్దామని తెలిపారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదామని మాజీ మంత్రి హరీశ్‌రావు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ఫేక్ వార్తలతో బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉం టుందని, ఏ కష్టం వచ్చినా అధైర్యపడొద్దని సూచించారు. మెదక్ ఎంపీ గెలవడం పక్కా అని, భవిష్యత్తు మనదేనని దీమా వ్యక్తం చేశారు. మెదక్‌లో ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని తెలిపారు. పాపన్నపేట మండలం ఏడుపాయల అభివృద్ధికి రూ.100 కోట్లతో జీవో ఇచ్చారని, అభివృద్ధి చేస్తారో లేదో చూద్దామని తెలిపారు.
తాను ఎన్నికల్లో ఓడిపోయినా ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటానని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామన్నారు. మెదక్ అభివృద్ధిని పట్టించుకోవాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రజల పక్షాన ప్రశ్నిస్తామన్నారు. కాంగ్రెసోల్లు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు.
పింఛన్లు, కల్యాణలక్ష్మి తదితర సంక్షేమ పథకాలను తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను కేసీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకున్నారని ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి అన్నారు. రైతులకు అండగా రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ , నాయకులు తిరుపతిరెడ్డి, గాలి అనీల్‌కుమార్ తదితరులు ఉన్నారు.