పాపన్నపేట, ఏప్రిల్ 13 : తెలంగాణను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్‌ని మళ్లీ ఒకసారి ఆశీర్వదించాల్సిన సమయం ఆసన్నమైందని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. పాపన్నపేట మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామ శివారులోని ఫంక్షన్హాల్లో గురువారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి చూస్తే రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందిందో అర్థమవుతుందని ఆమె వెల్లడించారు. తెలంగాణ రాక ముందు ఏగల్లి చూసినా గజిబిజీ ఉండేదని, ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా కాలికి మట్టి అంటడం లేదని ఆమె అన్నారు. గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేయడంతోనే ఇది సాధ్యపడిందన్నారు. అప్పట్లో ఎవరికైనా పెన్షన్ కావాలంటే పింఛన్ పొందే వ్యక్తి చనిపోతేనే మరో వ్యక్తి కొత్త పెన్షన్ ఇవ్వడం సాధ్యపడేదని, ఇప్పుడు అలా కాకుండా 58 ఏండ్లు నిండిన ప్రతి అర్హుడుకి పెన్షన్ అందుతున్నదన్నారు. గరీబోళ్ల బిడ్డలకు కల్యాణలక్ష్మి అందజేసి వారికి సీఎం కేసీఆర్ అండగా నిలుస్తు న్నారని ఎమ్మెల్యే అన్నారు. అప్పట్లో 60,70 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ఏమి అభివృద్ధి చేశాయో మీరే చెప్పండి అంటూ ప్రజలను కోరారు. త్వరలో సొంత జాగా కలిగిన అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు నిర్మించుకోవడానికి రూ. మూడు లక్షలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఎమ్మెల్యే వెల్లడించారు.
గతంలో నీటి కష్టాలు
తెలంగాణ రాకముందు ఏ గ్రామంలో చూసినా నీటి కష్టాలు ఉండేవని ఎమ్మెల్యే అన్నారు. గతంలో ఎవరైనా చనిపోతే స్నానాలు చేయడానికి నీళ్లు లేక పోయేవని సంబంధిత ఏఈకి చెప్పి కరెంటు వేయించుకొని స్నానాలు చేయాల్సిన పరిస్థితి అప్పట్లో ఉండేదన్నారు. తాగునీటి కోసం ఆడపడుచులు పడరాని పాట్లు పడేవారని గ్రామ పొలిమేర వరకు వెళ్లి చేదబావి నుంచి నీళ్లు తెచ్చుకునే వారని తెలిపారు. ఇప్పుడు ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. 24 గంటల కరెంటుతో పాటు, రైతు బంధు, రైతు భీమా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు రైతులకు సాగునీరు అందించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేసి వేలాది ఎకరాలకు నీరందిస్తున్నారని అన్నారు. అప్పట్లో పాపన్నపేట మండలానికి సాగు నీరు అందించడానికి సింగూరు నీరు ఘనపూర్ ఆనకట్టకు వదలాలంటే రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అలా కాకుండా సమయానుకూలంగా నీరు వదులుతూ పంటలను రక్షిస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
అప్పుడు రోగాల తెలంగాణ.. ఇప్పుడు ఆరోగ్య తెలంగాణ
తెలంగాణ రాక ముందు ఏ గల్లీలో చూసినా చెత్తాచెదారం పేరుకుపోయేదని ప్రస్తుతం గ్రామ గ్రామాన డంపింగ్యాడ్ను ఏర్పాటు చేసి చెత్త తరలించే వాహనాల ద్వారా ఎప్పటికప్పుడు గ్రామాలను పరిశుభ్రం చేస్తు న్నారని, ఏ గ్రామంలో కూడా అపరిశుభ్రత కనిపించడం లేదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. దీంతో గ్రామీణ ప్రజలకు రోగాల బాధ తప్పిందని ఆరోగ్య తెలంగాణగా ఏర్పడిందని ఎమ్మెల్యే వెల్లడించారు. అంతేగాకుండా ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసి వేలాది మొక్కలు పెంచడం మూలంగా పరిశుభ్రమైన గాలి అందుతున్నదని ఎమ్మెల్యే వెల్లడించారు. అనంతరం మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణలో చేసిన అభివృద్ధి పనులను చూసి పక్క రాష్ర్టాలు కాపీ కొడుతున్నాయని, అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
భారీ ర్యాలీ
పాపన్నపేట మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు తరలి వచ్చారు. పాపన్నపేట మండలం పరిధిలోని ఎల్లాపూర్ గ్రామం నుంచి బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బైక్‌లు, కార్లతో ర్యాలీ నిర్వహించారు.
బీఆర్ఎస్, సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిలకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. గాంధారిపల్లి చౌరస్తా వద్ద ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి గజమాల వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి, పాపన్నపేట జడ్పీటీసీ సభ్యురాలు షర్మిల, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుమ్మరి జగన్, ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, రైతు సమన్వయ సమితి నాయకులు సోములు, గడిల శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అశోక్, పాపన్నపేట ఆర్యవైశ్య సంఘం నాయకులు బెజు గం శంకర్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.