మెదక్, (నమస్తే తెలంగాణ)/సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 14 : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని సంగారెడ్డి, మెదక్ కలెక్టర్లు డాక్టర్ శరత్, హరీశ్ సూచించారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సంగారెడ్డి కలెక్టర్ శరత్ మాట్లాడారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఈ నెల 16 నుంచి 18తేదీ వరకు మూడు రోజుల పాటు జిల్లాలో కట్టుదిట్టంగా నిర్వహించాలన్నారు.
తెలంగాణ జాతీ య సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో నిర్వహించే వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. 16న ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాలు, అన్ని వర్గాల ప్రజల సహకారంతో భారీ ర్యాలీ, సమావేశాలను నిర్వహించాలన్నారు. 17న జిల్లా కేంద్రంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
అదేరోజున హైదరాబాద్‌లో జరిగే ఆదివాసీ భవన్, బంజారా భవన్ ప్రారంభానికి జిల్లా నుంచి ఎస్టీ అధికారులు, సిబ్బంది, ఎస్టీ వర్గాల ప్రజలను తరలించాలన్నారు. వారికి అవసరమైన తాగునీరు, బస్సు, భోజన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ నెల 18న జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వజ్రోత్సవ ఏర్పాట్లపై ఎస్పీ రోహిణిప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్‌లతో కలిసి కలెక్టర్ హరీశ్ సమీక్షించారు. ఈ నెల 16న ప్రతి నియోజకవర్గంలో 15వేల మందితో ర్యాలీలు, సభలు, 17న జాతీయ పతాకావిష్కరణ, 18న సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు స్వాతంత్య్ర సమరయోధులు, మెదక్ నియోజకవర్గం నుంచి వెళ్లే బస్సులు కొంపల్లిలోని ఎస్ఎన్ఆర్ గార్డెన్స్‌లో భోజనం ఏర్పాటు చేయాలని సూచించారు.
అనంతరం ఆదివాసీ గిరిజన సమ్మేళనం అనే కరపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు సైదులు, యాదవరెడ్డి, ఆర్డీవోలు సాయిరాం, వెంకట ఉపేందర్‌రెడ్డి, జడ్పీ సీఈవో శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీటీవో శ్రీనివాస్‌గౌడ్, మెప్మా పీడీ ఇందిర, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, బీసీ అభివృద్ధి అధికారి కేశురాం, యువజన సంక్షేమాధికారి నాగరాజు, డీఈవో రమేశ్ ,జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎంపీడీవోలు, అధికారులు పాల్గొన్నారు.