సిద్దిపేట, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈనెల 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జయప్రదం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వాహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల సమన్వయంతో అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించాలని మంత్రి సూచించారు. వజ్రోత్సవాల విజయవంతానికి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించాలన్నారు.
ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ మూడు రోజులు వేడుకను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ నెల 16న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఆ రోజున నియోజకవర్గాల వారీగా 15వేల మందితో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ర్యాలీలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉద్యోగులు మహిళా సమాఖ్య ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు జాతీయ జెండాలో పొల్గొనేలా చూడాలన్నారు. దీనికోసం 10 వేల చిన్న , 50 వేల పెద్ద జెండాలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం అనంతరం అక్కడే సమావేశం ఏర్పాటు చేసి వచ్చిన వారికి బోజన వసతి ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.
ఈ నెల 17న జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. అదేరోజున హైదరాబాద్‌లోని బంజారా భవన్, సేవాలాల్ భవన్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో పబ్లిక్ మీటింగ్ ఉంటుందన్నారు. కార్యక్రమాలకు అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలివెళ్లేందుకు రవాణా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 18న జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్లు శరత్, ప్రశాంత్ జీవన్ పాటిల్, హరీశ్, అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, మాణిక్‌రావు, క్రాంతి కిరణ్, సతీశ్ కుమార్, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, చేనేత అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి పాల్గొన్నారు.