మెదక్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : సమర్థుడైన నాయకులను ఎన్నుకోవడంలో ఓటర్లే కీలకమని, 18 ఏండ్లు నిండిన ప్రతి యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. మంగళవారం స్వీప్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని అడిటోరియంలో వివిధ కళాశాలల అంబాసిడర్లకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో జనవరి ఒకటి ప్రామాణికంగా18 ఏండ్లు నిండిన యువతకు ఒక్కసారి మాత్రమే ఓటరుగా నమోదుకు అవకాశముండేదని, కానీ భారత ఎన్నికల కమిషన్ ఎక్కువ మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రతి ఏటా జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించేందుకు ఏడాదిలో నాలుగు సార్లు ఓటరు నమోదుకు అవకాశం కల్పించిందన్నారు. భారత రాజ్యాంగంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ నైతికంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కాగా ఓటరు నమోదుకు కొత్తగా రూపొందించిన ఫారం-6ను ఉపయోగించాలన్నారు.
ఇది వరకే ఓటరు కార్డు ఉన్న వారు ఫారం-6 బీ ద్వారా ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని, అభ్యంతరాలుంటే ఫారం 7 చిరునామా మార్పు, సవరణలకు ఫారం-8 ఉపయోగించాలని సూచించారు. ప్రతి యువత ఓటరు హెల్ప్‌లైన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని లేదా www.nvsp.in వెబ్సైట్ ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్యాంపస్ అంబాసిటర్లకు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగ ప్రశంసాపత్రాలు అందజేస్తామని రమేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శైలేశ్, స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, ఆర్డీవో సాయిరాం, ఈడీఎం సందీప్, ఎలక్ట్రోరల్ లిటరసీ నోడల్ అధికారులు, క్యాంపస్ అంబాసిడర్లు పాల్గొన్నారు.