సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 12: ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు గ్రీవెన్స్‌సెల్ నిర్వహిస్తున్నామని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి తరలివచ్చారు. భూములు కోల్పోతున్న వారిని ఆదుకోవాలని హత్నూర మండలం దేవులపల్లికి చెందిన పలువురు రైతులు అర్జీ పెట్టుకున్నారు.
కాళేశ్వరం కాల్వలో 60 ఎకరాల భూమి పోయిందని, దేవులపల్లి నుంచి నారాయణఖేడ్‌కు వెళ్లే కాల్వలోనూ భూములు కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ గ్రామానికి చెందిన జీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. 84.20 ఎకరాల పట్టా భూమికి సంబంధించిన రిజిష్ర్టేషన్ను ఓపెన్ చేయాలని కోరారు. ఆయా అర్జీలను స్వీకరించిన కలెక్టర్ వాటిని విచారించి సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
మెదక్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ ): ప్రజావాణిలో వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి 24 విజ్ఞప్తులు వచ్చాయి. అందులో 8 డబుల్ బెడ్రూం ఇండ్లు కావాలని, మిగతా 16 భూ సమస్యలు, ఆసరా పింఛన్లు తదితర శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ తమ గోడు అధికారులకు చెప్పుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని, నమ్మకంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రజావాణికి వస్తారని అన్నారు.
వారి నమ్మకాన్ని అధికారులు నిలబెట్టాలన్నారు. విజ్ఞప్తులను ఆయా శాఖాధికారులకు అందజేస్తూ వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తూప్రాన్ మండలంలోనని రావెల్లి, లింగారెడ్డిపేట, శివ్వంపేట మండలం శభాశ్పల్లి గ్రామాలకు వెళ్లేందుకు బండ్ల బాటను దర్జాగా కబ్జా చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఏండ్లుగా ఉన్న దారిని రియల్ వ్యాపారులు కబ్జా చేసి హద్దులు ఏర్పాటు చేస్తున్నారని రైతులు మల్లేశం, సురేందర్‌రెడ్డి, గణేశ్, భిక్షపతి, బాలయ్య, కృష్ణ, పాండు, వెంకటేశ్, మల్లేశ్ వాపోయారు. కార్యక్రమంలో డిఎస్వో శ్రీనివాస్, డిఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.