సిద్దిపేట, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం దళితబంధు. ఈ పథకం దళితుల ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక అసమానతలు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బృహత్తర పథకం.ఈ పథకంలో యూనిట్లు ఏర్పాటు చేసుకు న్న లబ్ధిదారులు తమ కాళ్లపై తాము నిలబడి, మరో పదిమందికి ఉపాధినిచ్చేలా ఎదుగుతున్నారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న సంక్పలంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తుండగా.. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు.
ప్రభుత్వం అందించిన చేయూత వారి బతుకులు మారుస్తున్నది. సిద్దిపేట జిల్లాలో 495 మంది లబ్ధిదారులకు రూ.49.50 కోట్లతో 60 రకాల యూనిట్లను ప్రభుత్వం అందించి, ఆ కుటుంబాల్లో వెలుగులు నింపింది. ప్రభుత్వం అందించిన సాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదగాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. ఇవాళ ఆ మాటలను నిజం చేస్తున్నారు. లబ్ధిదారులకు దళిత రక్షణనిధి రక్షణ కవచంగా నిలుస్తున్నది. ఏదైనా జరగరానిది జరిగి లబ్ధిదారుని కుటుంబం తిరిగి పేదరికంలోకి జారిపోకుండా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది.
లబ్దిదారుల నుంచి రూ.10వేలు, మరో రూ.10 వేలు ప్రభుత్వం జమచేసి దళిత రక్షణనిధిని ఏర్పాటు చేసి ఆ కుటుంబాలకు భరోసానిస్తున్నది. రక్షణ నిధి నిర్వహణ కలెక్టర్ పర్యవేక్షణలో లబ్ధిదారుల కుటుంబాలు నిర్వహిస్తున్నాయి. స్వయం సహకార బృందాల మాదిరిగా వారు పరస్పరం సహకరించుకునేలా ప్రభుత్వం ఈ రక్షణ వ్యవస్థను రూపొందించింది.
లబ్ధిదారులు ఉపాధిని ఎంచుకునే వరకే పరిమితం కాకుండా, వారి ఉపాధి ప్రగతిని ఎప్పటికప్పడు అధికారులు సమీక్షిస్తున్నారు. పథకం అందించినప్పటి నుంచి ఇప్పటి వరకు వారి వ్యాపారాలు ఎలా కొనసాగుతున్నాయి?. వ్యాపారంలో మెళకువలు తదితర వాటి పై అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు. మూడు నాలుగు నెలల నుంచి వారి ఎంచుకున్న వ్యాపారాల్లో ఎలా వృద్ధి చెందారో వారి మాటల్లోనే..
ఒక్కో లబ్ధిదారునికి రూ.10 లక్షల చొప్పున దళితబంధు పథకంలో గ్రాంట్‌గా ప్రభుత్వం అందిస్తున్నది. సిద్దిపేట జిల్లాలో 495 మందికి దళితబంధును అందించింది. జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామాన్ని పూర్తిస్థాయిలో ఎంపిక చేసి, ఆ గ్రామంలోని 135 మందికి ఇంటికి ఒక్కరు చొప్పున పథకాన్ని అమలు చేసింది.
సిద్దిపేట నియోజకవర్గంలో 101 మందికి, దుబ్బాక నియోజకవర్గంలో 100మందికి, హుస్నాబాద్ నియోజకవర్గంలో 100 మందికి, జనగామ నియోజకవర్గంలో 40 మందికి, మానకొండూరు నియోజకవర్గంలో 19 మందికి దళితబంధును అందించారు. ప్రభుత్వం అందించిన చేయూతతో ఒకరు పాడిపరిశ్రమ, మరొకరు నాలుగు చక్రాల వాహనాలు, ల్యాబ్ టెక్నీషియన్, కారు ట్యాక్సీ, క్లాత్ ఎంపోరియం, వరికోత మిషన్ , టెంట్‌హౌస్‌లు ఇలా లబ్ధిదారులు తమ ఇష్ట ప్రకారం యూనిట్లు ఎంచుకునారు.
జిల్లాలో నాలుగు చక్రాల వాహనాలు 52 మందికి, ఆటోమొబైల్ పార్ట్స్ 7, భవన నిర్మాణ మెటీరియల్ స్టోర్, హార్డ్‌వేర్ కోసం 2, కారుట్యాక్సీ (ట్రాన్స్‌పోర్టు) 32 మందికి, సిమెంట్ స్టీల్షాప్ 8 మందికి, సెంట్రింగ్ ఆర్సీసీ రూప్ యూనిట్ కోసం 40 మందికి, క్లాత్ ఎంపోరియం 3, డయాగ్నోస్టిక్ ల్యాబ్, మెడికల్ షాప్ 2, పేపర్ ప్లేట్స్ ఒకరు, డీటీపీ, మీసేవ 3, ఎలక్ట్రికల్ షాపు 3, ఎలక్ట్రికల్ ప్లంబింగ్, శానిటరీ షాప్ 2, ఎలక్ట్రికల్ మోటర్ వైండింగ్ 3, మెడికల్ జనరల్ స్టోర్స్ 5, మినీ డెయిరీ యూనిట్ 44మందికి, మొబైల్ టిఫిన్ సెంటర్ 4, పౌల్ట్రీ ఫాం 6, సీడ్స్, బయోపెస్టిసైడ్ ఫర్టిలైజర్ దుకాణాలు 7, టెంట్‌హౌస్ దుకాణాలు 27మందికి, ట్రాక్టర్ ట్రాలీ 81మందికి, మేకల యూనిట్ షెడ్ 9 మందికి, హార్వెస్టర్ యూనిట్ గ్రూప్ 15మందికి, మినీ డెయిరీ, మిక్చర్ సెంట్రింగ్ 21మందికి, పౌల్ట్రీ ఫాం, షెడ్ 67మందికి, మొత్తంగా 60కి పైగా వివిధ రకాల యూనిట్లు తీసుకున్నారు.

మొన్నటి వరకు మాకు కూలే జీవనాధారం. రెక్కాడితే కాని డొక్కాడని బతుకు మాది. దళిత బంధుపథకం మా జీవితాల్లో వెలుగులు నింపింది. సీఎం కేసీఆర్ దళితులు ఆత్మగౌరవంతో బతకాలని, మాలాంటి వారి జీవితాల్లో వెలుగులు తీసుకురావాలనే ఉద్దేశంతో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. కూలీగా పనిచేసిన చోట నేడు ఓనర్ పనిచేస్తూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నా. మా గ్రామం సిద్దిపేట పట్టణం గాడిచెర్లపల్లి. 12 ఏండ్ల నుంచి సుతారి, సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం వెళ్లదీసేవాడిని. నిత్యం కూలీ చేస్తే గాని ఇల్లు గడవని పరిస్థితి మాది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సార్లు మూడు నెలల కింద నాకు దళితబంధు ఇచ్చారు.
ఈ డబ్బులతో సెంట్రింగ్ డబ్బా, ప్యానెల్, జాకీలు కొనుగోలు చేశా. సిద్దిపేట నాగదేవత గుడివద్ద షెట్టర్ కిరాయికి తీసుకుని దుకాణం పెట్టాం. మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. సెంట్రింగ్ డబ్బాను ఇప్పటికీ రెండుసార్లు కిరాయికి ఇచ్చా. నెలకు రూ.25 వేల చొప్పున డబ్బులు వచ్చాయి. ఇతర ఖర్చులు పోగా, నెలకు రూ.23వేలు మిగిలాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో నేడు ఓనర్‌గా మారడం గర్వంగా ఉంది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు జీవితాంతం రుణపడి ఉంటాం.

కొమురవెల్లి, ఆగస్టు 21: దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంతో చాలామంది జీవితాల్లో వెలుగులు నిండాయి. కొన్ని రోజుల క్రితం డ్రైవర్‌గా నెల జీతానికి పనిచేసిన వారు నేడు ఓనర్లుగా మారారు. కొమురవెల్లి మండలంలో 8 మంది లబ్ధిదారులకు దళితబంధు పథకం కింద డబ్బులు వచ్చాయి. మండలంలోని గురువన్నపేటకు చెందిన ఓరుగంటి చంద్రం తన అనుభవాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నాడు. గతంలో డ్రైవర్‌గా పనిచేస్తే రోజుకు రూ.300 నుంచి 500 వరకు వచ్చేవి. రూ.10లక్షలు పెట్టి ట్రాక్టర్‌ను కొనుగోలు చేస్తానని కలలో కూడా ఊహించలేదు. కొన్ని రోజుల క్రితం డ్రైవర్‌గా నెల జీతానికి పనిచేసిన నేను.. నేడు ఓనర్‌గా సొంతంగా ట్రాక్టర్ దున్నడం ద్వారా రూ.3లక్షలు సంపాదించా. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘దళితబంధు’తో మా జీవితాల్లో వెలుగులు నిండాయి.
గజ్వేల్ రూరల్, ఆగస్టు 21: తెలంగాణ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ‘దళితబంధు’ ఎన్నో కుటుంబాలకు కడుపు నింపుతున్నది. ఈ పథకం కింద 135 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడంతో మండలంలోని కొల్గూర్ దళిత కాలనీలో పండుగ వాతావరణం కన్పిస్తున్నది. గజ్వేల్ నియోజకవర్గంలో కొల్గూర్ గ్రామాన్ని ఈ పథకం కింద సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఎంపిక చేయడంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. ప్రతి కుటుంబానికి రూ.10లక్షలు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో కిరాణం, బ్యాంగిల్ స్టోర్, సెంట్రింగ్ సామగ్రి, టిఫిన్ సెంటర్, టెంట్‌హౌస్, డెయిరీ ఫామ్‌లు పెట్టుకొని జీవనోపాధి పొందుతున్నారు.

రెండు నెలల క్రితం సీఎం కేసీఆర్ మా నాన్న సత్తయ్య పేరుమీద దళితబంధు పథకంలో రూ.10లక్షల ఇచ్చాడు. దాంతో ఇంటి వద్దనే కిరాణా దుకాణం, బ్యాంగిల్ స్టోర్‌ను తమ్ముడి సహకారంతో పెట్టా. రోజు రూ. 6వేల వరకు గిరాకీ అవుతున్నది. సీఎం కేసీఆర్ మాకు దేవుడితో సమానం. మా బతుకులు బాగుచేసిన సార్‌ను మరిచిపోలేం. ఊర్లో చాలామంది వేర్వేరు పనుల కోసం డబ్బులను వినియోగించుకుని బాగుపడుతున్నారు. ఇప్పుడిప్పుడే మా కుటుంబాల్లో వెలుగులు నిండాయి. కేసీఆర్ దళితబంధుతో మాకు రూ.10 లక్షలు ఇవ్వడంతో ఎంతో సంతోషం కలిగింది. గ్రామంలో దుకాణం పెట్టిన విషయం ఇప్పుడిప్పుడే తెలుసు. అందరికీ తెలిస్తే మంచి గిరాకీ అవుతుంది.
– నీరుడి లక్ష్మి, కొల్గూర్, గజ్వేల్ మండలం
హైదరాబాద్‌లో టిఫిన్ సెంటర్లో పనిచేసేవాడిని. మా ఊరికి కూడా సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ఇస్తున్న విషయం పేపర్ల చూసి ఇంటికి వచ్చాను. అధికారులు సర్వే చేశారు. నేను కూడా సర్వేలో పాల్గొని టిఫిన్ సెంటర్ పెడతానని చెప్పా. టిఫిన్ సెంటర్ కోసం అధికారులు దళితబంధు పథకం ద్వారా రూ.10 లక్షలు బ్యాంకులో జమ చేశారు. ఆ డబ్బులతో మొబైల్ టిఫిన్ సెంటర్ కొనుకున్నా. అహ్మదీపూర్ చౌరస్తాలో నడిపిస్తున్నాను. అహ్మదీపూర్, కొల్గూర్, దిలాల్పూర్ గ్రామాలతో పాటు రోడ్డు మార్గంలో వెళ్లేవారు వస్తుండడంతో మంచిగా గిరాకీ అవుతున్నది. రోజు ఖర్చులు పోను రూ.800 ఆదాయం వస్తున్నది. సొంతంగా టిఫిన్ సెంటర్ నడిపిస్తుండడంతో ఎంతో సంతృప్తి కలుగుతున్నది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు.
– నీరుడి నరేశ్, కొల్లూర్, గజ్వేల్ మండలం
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు దయతో దళితబంధు పథకం కింద డోజర్ ట్రాక్టర్ వచ్చింది. వ్యవసాయ పనులు చేసుకుంటూ డోజర్ ద్వారా రోజుకింత ఆదాయాన్ని సమకూర్చుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నాం. గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయకసాగర్‌లోకి నీళ్లు రావడంతో మాలాంటి రైతులకు ఇంత పని దొరుకుతున్నది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మాలాంటి పేదవారికి దళితబంధు ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు రుణపడి ఉంటాం.
-రోమాల దేవయ్య, లబ్ధిదారుడు-బంజేరుపల్లి

మేస్త్రీ పనికోసం రోజు గజ్వేల్ అడ్డమీదికి పోయేవాడిని. కానీ, ఇప్పుడు సెంట్రింగ్ డబ్బాను ఇండ్ల నిర్మాణానికి ఇచ్చే స్థాయికి ఎదిగాను. ఇదంతా సీఎం కేసీఆర్ మంచి ఆలోచనతోనే జరిగింది. రోజు మేస్త్రీ పని చేస్తేనే కుటుంబం గడిచేది. కానీ, నెలలో రెండుసార్లు మిల్లర్, ఫిల్లర్ బాక్సులు, సెంట్రింగ్ బాక్స్‌లు కిరాయికి పోతాయి. నెలకు రూ.30వేల వరకు ఆదాయం వస్తున్నది. జీవితంలో అన్నం పెట్టిన సీఎం కేసీఆర్ సారును మరిచిపోను. ఇతరులకు పని ఇచ్చే స్థాయికి ఎదిగానంటే సీఎం కేసీఆర్ చేసిన మేలు. కడుపునిండా అన్నం పెట్టిన ప్రభుత్వానికి మేమంతా రుణపడి ఉంటాం.
– బండారు మల్లేశం, కొల్గూర్, గజ్వేల్ మండలం
దళితులు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. దళిత జాతి చరిత్రలోనే ఇది గొప్ప పథకం. 60 ఏండ్లుగా పాలకులు దళితుల బాధలను పట్టించుకోలేదు. ఇన్నేండ్లుగా దళితులకు చేసిన సాయం గోరంత. ప్రభుత్వాలు మారుతున్నా దళితుల ఆర్థిక పరిస్థితులు, జీవన స్థితిగతుల్లో ఎలాంటి మార్పులు రాలేదు. కానీ, నేడు టీఆర్ఎస్ సర్కారు దళితుల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. దళితులకు అన్నిరంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ పెద్దపీట వేస్తున్నది. దళితులకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– లింగాల శ్రీనివాస్, దళితనేత, రామవరం, అక్కన్నపేట

నాపేరు కోలాపురం కృష్ణ. మాది పోతారం(జే) గ్రామం. నాకు దళితబంధు వచ్చింది. అలాగే, మా ఊరిలో దళితులందరికీ దళితబంధు వచ్చింది. నేను తాపీమేస్త్రీ పనిచేస్తాను. ఇండ్ల నిర్మాణానికి ఉపయోగపడే సెంట్రింగ్ చెక్కను దళితబంధు పథకంలో ఎంపిక చేసుకున్నా. దళితబంధు ద్వారా సెంట్రింగ్
చెక్క కొనుగోలు చేసిన. మా ఊరిలో మూడు ఇండ్ల నిర్మాణాలకు సెంట్రింగ్ చెక్క కొట్టాను. మూడు నెలల్లో రూ. 1.50లక్షల వరకు సంపాదించా. చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్న. దళితబంధు పథకం అనేక కుటుంబాలకు స్వయం ఉపాధి చూపించింది. మా ఊరిలో కొంతమంది సెంట్రింగ్, ఆవులు, గేదెలు, కిరాణం, బట్టల షాపులు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో పనికోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేవాళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బాగుపడుతున్నాం. చేతినిండా పని దొరుకుతున్నది. నాలుగు పైసలు కనపడుతున్నయ్. సీఎం కేసీఆర్ దళితబంధు పెట్టి మాబతుకులను మార్చాడు. జీవితాంతం ఆ సార్‌కు రుణపడి ఉంటాం.
– కోలాపురం కృష్ణ, దళిబంధు లబ్ధిదారుడు, పోతారం(జే), అక్కన్నపేట
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో లబ్ధిదారుడిగా ఎంపిక చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. దళితబంధు డబ్బులతో సిమెంట్, ఐరన్ షాపు ఏర్పాటు చేసుకున్నా. రోజువారీగా వ్యాపారం చేసుకుంటూ కుమారులను చదివిస్తున్నా. రానున్న రోజుల్లో షాపును మరింత అభివృద్ధి చేసుకుంటా. మార్కెట్లో ఇతర దుకాణాల కంటే తక్కువ ధరకు విక్రయాలు జరుపుతున్నా. నెలవారి ఖర్చులు పోను నెలకు రూ.15 నుంచి 17 వేలు మిగులుతున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి రుణపడి ఉంటా.
– ముస్త్యాల కిష్టయ్య, లబ్ధిదారుడు, చేర్యాల

‘దళితబంధు’ రాకముందు మా కుటుంబం ఎన్నో కష్టాలు పడింది. చేతిలో పైసలు ఉండేవి కావు. ఎంత కష్టం చేసినా చేతిలో రూపాయి కూడా ఉండేది కాదు. సీఎం కేసీఆర్ దళితబంధు కింద మా గ్రామాన్ని ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. దళితబంధు డబ్బులతో మొబైల్ టిఫిన్ వాహనాన్ని కొనుకున్నా. టిఫిన్ సెంటర్ ద్వారా రోజుకు 2 నుంచి రూ.3 వేల వరకు ఆదాయం వస్తున్నది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మొబైల్ టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. రోజుకు మూడుపూటలా కడుపునిండా తింటున్నాం. మాలాంటి పేదలకు దళితబంధు పథకం పెట్టి ఆదుకుంటున్న దేవుడు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్,మంత్రి హరీశ్‌రావు సార్లకు కృతజ్ఞతలు.
– రోమాల బాబు, లబ్ధిదారుడు, బంజేరుపల్లి, నారాయణరావుపేట మండలం
వెలుగులు విరజిమ్ముతున్నాయి. ‘దళితబంధు’ పథకం వారి తలరాతను మారుస్తున్నది. ఏడాది క్రితం
పురుడు పోసుకున్న ఈ పథకం సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఎన్నో ఏండ్ల వెనుకబాటును
ఏడాదిలోనే దూరం చేసి, కూలీనాలి చేసుకునే జీవితాల్లో మార్పు తెచ్చింది. మొన్నటిదాకా
కూలీలు, డ్రైవర్లుగా పనిచేసిన వారు.. నేడు ఓనర్లు, వ్యాపారులుగా మారారు. తమ కాళ్లపై తాము నిలబడడమే కాకుండా మరికొంత మందికి ఉపాధి చూపిస్తూ సగర్వంగా బతుకుతున్నారు. తమకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామంటూ లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టగా.. జిల్లాలో
తొలి విడతగా 495మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారికి రూ.49.50 కోట్లతో 60 రకాల యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయించింది. ప్రభుత్వం అందించిన రూ.10 లక్షల సాయంతో లబ్ధిదారులు యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు. సొంతంగా విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబాలను పోషించుకోవడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
– సిద్దిపేట, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)